తిరుమలలో ఉదయం, సాయంత్రం వేర్వేరు వంటకాలతో భోజనం
తిరుమల: శ్రీవారి భక్తులకు ఉదయం, సాయంత్రం వేర్వేరు వంటకాలతో రుచికరమైన భోజనం అందించాలని తితిదే నిర్ణయించిందని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో గురువారం కూరగాయల దాతలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తులకు రుచికరంగా 14 రకాల వెరైటీలతో భోజనాన్ని అందించేందుకు తితిదే చర్యలు చేపట్టిందని వివరించారు. అన్నప్రసాదం విభాగం కోరిన ప్రకారం కూరగాయలను సరఫరా చేయాలని దాతలను కోరారు.
ప్రతిరోజు కూరలు, సాంబారు, రసం చేయడానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో రోజుకు 90 యూనిట్లు అవుతుందని అందులో ఉదయం 56 యూనిట్‌లు, రాత్రి 34 యూనిట్‌లు (ఒక యూనిట్ 250 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించడానికి సమానం) తయారు చేస్తున్నట్లు చెప్పారు.