తిరుమ‌ల ద‌ర్శ‌నం చేయిస్తే... మా పరువు పోతోందని మంత్రుల ఆవేదన

మంగళవారం, 31 ఆగస్టు 2021 (16:03 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఓ ఉన్నతాధికారి వైఖరితో మనస్తాపం చెందుతున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి రావడానికి ఎంతో కష్టపడిన తమకు, తీరా అధికారం ఉన్నప్పటికీ కనీసం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకునే భాగ్యం కూడా లేకుండా పోతోందని వాపోతున్నారు. అడిగిన వారికి తమతోపాటు దర్శనం చేయించలేకపోతున్నామంటూ స్వయంగా మంత్రులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ లోని ఓ ఉన్నతాధికారి నలుగురు మీడియా ప్రతినిధులతో కుమ్మకై పథకం ప్రకారం దర్శనం టికెట్ల సమాచారాన్ని లీకులు చేయించి, మంత్రుల ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని మండిపడుతున్నారు. 
 
ఇటీవల వరుసగా రాష్ట్ర మంత్రుల పైనే పదుల సంఖ్యలో విఐపి బ్రేక్ దర్శనాల కోసం ఒత్తిడి చేస్తున్నారంటూ, వందల సంఖ్యలో అనుచరులతో కలిసి బ్రేక్ దర్శనాలు చేసుకున్నారని మీడియాలో అభియోగాలు రావడంతో వారు జీర్ణించుకోలేక పోతున్నారు. టీటీడీలో తమ ఒత్తిడిపై మంజూరు చేస్తున్న బ్రేక్ దర్శనాల వివరాలను క్షణాల్లో అపరిచితులు మీడియాకు గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తున్నారు. దీంతో ఇలా మంత్రులు వీఐపీలు స్వామివారి దర్శనం చేసుకుని మహద్వారం వెలుపలికి రాగానే,  వెంటనే, మీరు 56 మందితో బ్రేక్ దర్శనం చేయించుకున్నారట కదా...? ఇది సామాన్య భక్తులకు ఇబ్బంది కాదా? అంటూ మీడియా ప్రశ్నిస్తుండడంతో, మంత్రులు సైతం అవాక్కవుతున్నారు.
 
అసలు ఈ వివరాలను మీడియాకు క్షణాలలో అందిస్తున్న  అధికారులు ఎవరు? అని ఆశ్చర్యపోతున్నారు. ఇదే విషయంగా మంత్రులు తీవ్ర సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీలో సమాచారం బయటకు రాకుండా తమకు సమాచార హక్కు చట్టం సైతం వర్తించదని అందరితోనూ మొండిగా వాదించే టీటీడీ, మంత్రుల వ్యవహారంలో మాత్రం వారి పరువు తీయాలనే ఉద్దేశంతోనే ఇలా టీటీడీ ఉన్నతాధికారి కార్యాలయం నుండే మీడియాకు లీకులు ఇస్తున్నారని అనుమానిస్తున్నారు. 
 
సహజంగానే తిరుమలకు మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వచ్చే సమయంలో వారితో పాటు అనుచరులు ముఖ్య కార్యకర్తలు వారి బంధువులు కూడా వస్తుంటారు. ఇదే క్రమంలో వరుసగా ఇటీవల స్వామివారిని దర్శించుకున్న  రాష్ట్ర మంత్రులైన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి గుమ్మనూరు జయరాం, మరో మంత్రి వేణుగోపాల్, తదితరులు తమతో పాటు కొంతమంది అనుచరులను పట్టుబట్టి మరీ విఐపి బ్రేక్ దర్శనాల‌కి తీసుకెళ్లారు. ఒక మంత్రి 56 మందిని మరో మంత్రి 37 మందిని ఇలా వంద సంఖ్యలోపుగా మంత్రులు వారి అనుచరులను శ్రీవారి దర్శనానికి బ్రేక్ సమయంలో తీసుకెళ్లి ప్రోటోకాల్ మర్యాదను చేయించుకున్నారు.

ఇదే విషయాన్ని మంత్రుల వద్ద నుండి ఒత్తిడికి గురైన టిటిడి ఉన్నతాధికారి ఒకరు తెలివిగా తిరుమలలో భజన చేసే నలుగురు మీడియా బృందంతో లీకులు చేయించడం మొదలుపెట్టారు. ఈ సమాచారాన్ని మంత్రుల దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియా ప్రశ్నించడం, దాన్ని కావాలనే రాద్ధాంతం చేయడం, ఇలాంటి రాజకీయాలను టీటీడీ లోని ఉన్నతాధికారి చేస్తున్నారని మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు