శాసన రాజధాని ఏర్పాటు దిశగా చర్యలు

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (09:34 IST)
అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు దిశగా ప్రభుత్వం దృష్టి సారించింది. అక్కడ భవనాల వినియోగంపై పరిశీలన చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసింది.

గతేడాది ఆగస్టు 13వ తేదీన సిఎం వద్ద జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం అమరావతిలో ఉన్న భవనాలను వినియోగించుకునే అంశంపై పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీ రాజధాని పరిధిలో ఉన్న భవనాలన్నిటినీ పరిశీలించి శాసన రాజధానికి తప్పనిసరిగా అవసరమైన భవనాలు, మౌలిక వసతులు సమకూర్చుకోవడానికి, నిర్మాణం మధ్యలో ఉన్న భవనాలు హైకోర్టు, ఇతర కట్టడాలను పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనుంది.

దీంతో అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేయనున్నారనే అంశంపై ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా, ప్రణాళికాశాఖ కార్యదర్శి మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో అసెంబ్లీ కార్యదర్శి, సాధారణ పరిపాలన, పట్టణాభివృద్ధి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఎఎంఆర్‌డిఏ కమిషనర్‌ సభ్యులుగా ఉంటారు. 
 
రాజధాని పరిధిలో కరకట్ట నిర్మాణం, ఉన్న భవనాల వినియోగం తదితర అంశాలపై పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఎఎంఆర్‌డిఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం పర్యటించారు.

కరకట్ట నిర్మాణానికి అవసరమైన భూముల వివరాలకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజధాని పరిధిలో నిలిచిపోయిన భవనాల సముదాయాలనూ పరిశీలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు