మతసామరస్య కమిటీపై మంత్రుల సమావేశం

శుక్రవారం, 8 జనవరి 2021 (20:06 IST)
రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మత విద్వేషాలు రగిల్చి, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తోన్న దుష్ట శక్తులపై కఠినంగా వ్యవహించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అన్ని మతాల పెద్దలు, ప్రభుత్వ అధికారులతో కమిటీలు వేస్తూ జీవోను జారీ చేసింది. ఈరోజు అన్ని మతాలకు చెందిన పెద్దలతో ప్రభుత్వం తరఫున మంత్రులు బొత్స సత్యనారాయణ, అంజద్ భాషా, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్ లు సమావేశమై రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం సర్వమత పెద్దలు- ప్రభుత్వం తరఫున ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులు కావాలని ప్రతిజ్ఞ చేశారు.  రాజకీయాలకు మతాన్ని జోడించవద్దని, ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మత విధ్వేషాలను రగిల్చి అభివృద్ధి- సంక్షేమాన్ని అడ్డుకోవద్దని పిలుపు నిచ్చారు. ఏమతం కూడా హింసను ప్రోత్సహించమని చెప్పదని, పరమత సహనమే మన విధానం అని మంత్రులు, మత పెద్దలు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
అనంతరం పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.." వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది. అభివృద్ధి-సంక్షేమమే ప్రాతిపదికగా, పేద ప్రజల సంక్షేమమే ఏకైక అజెండాగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ప్రజా రంజకమైన పాలన చేస్తున్నారు.  
 
ఏ విధంగా వీటిని అడ్డుకోవాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రదిష్టపాలు చేయాలనే దుష్ట ఆలోచనలతో, ఏవిధంగానైనా ప్రభుత్వాన్ని అస్తిరపరచాలని పన్నాగాన్ని రచించి, అధికారం కోల్పోయిన చంద్రబాబు, మరికొందరు క్షుద్ర ఆలోచనలతో మత సామరస్యాన్ని రాష్ట్రంలో దెబ్బతీయాలని చూస్తన్నారు. చీకటిలో, ప్రజా సంచారం లేని ప్రాంతాల్లో, అర్థరాత్రి సమయాల్లో దుర్మార్గంగా దేవాలయాలపై దాడులు చేస్తున్నారు. 
 
ప్రజల్లో అపోహలు సృష్టించాలని, ఎప్పుడో జరిగిన సంఘటనలను కూడా తీసుకొచ్చి, ఇప్పుడు జరిగినట్టు, ఎక్కడైనా దేవాలయాల్లో పెచ్చులూడినా ధ్వంసం అంటూ..  వాటిని సోషల్ మీడియాలో పెట్టి.. ప్రజల్లో అలజడి సృష్టించాలని చూస్తున్నారు. మత సామరస్యం కోరుకుంటున్న ఈ ప్రభుత్వం.. అన్ని మతాలను సమ భావంతో చూస్తూ వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారు. 
 
సంక్షేమ కార్యక్రమాలను కులాలు, మతాలు అన్న ప్రాతిపదిక లేకుండా, పేదరికమే ప్రాతిపదికగా, శాచురేషన్ విధానంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి, పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు ఏరోజైతే ప్రారంభిస్తుందే.. దానికి ఒకరోజు అటో, ఇటో ఒక పథకం ప్రకారం దేవాలయాలపై దుశ్చర్యలకు పాల్పడుతూ, ప్రజల్లో అశాంతిని అల్లకల్లోలాలను సృష్టించాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. 
 
మత సామరస్యాన్ని పెంపొందించటానికి జీవో నంబరు 6 ను ముఖ్యమంత్రి జగన్  ఇచ్చారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని పెంపొందించాలి, దుస్సంఘటనలు ఎక్కడ జరిగినా ఖండించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ జీవో ఇవ్వటం జరిగింది. సర్వమత సామరస్యమే ఈ ప్రభుత్వ ఏకైక లక్ష్యం. 
 
రాష్ట్ర స్థాయిలో సీఎస్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, వివిధ శాఖల అధికారులను, అన్ని మతాలకు చెందిన పెద్దల్ని కూడా ఆ కమిటీల్లో నియమించి, వారి సలహాలు, సూచనలు, వారి అభిప్రాయాలను తీసుకోవాలని, అదే విధంగా జిల్లా స్థాయిల్లో కూడా అటువంటి కమిటీలను ఏర్పాటు చేస్తూ ఈ జీవో ఇవ్వటం జరిగింది. 
 
మతాల మధ్య ద్వేషాలు, విద్వేషాలు ఉండకూడదనే ఉద్దేశంతో.. సర్వమత పెద్దలందరితో కలిసి ప్రభుత్వం తరఫున ఒక ప్రకటన చేయాలనే ఈరోజు మీడియా ముందుకు వచ్చాం. ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా కలిసికట్టుగా ఎదుర్కొందాం. అడ్డుకుందాం. సంఘ విద్రోహ శక్తుల బండారాన్ని బయట పెట్టి, వారికి సమాజంలో స్థానం లేకుండా చేయాలని కోరుతున్నాం. సమాజంలో ఎటువంటి అశాంతి లేకుండా, అన్ని మతాలను గౌరవించుకుంటూ, సోదరుల్లా జీవించాలన్న దృక్పథంతోనే ప్రభుత్వం ముందుకు వెళుతుంది. 
 
రామతీర్థంలో జరిగిన ఘటనను చూస్తే.. విజయనగరం జిల్లాలో ఒకే ప్రాంతంలో సుమారు 12 వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తున్న నేపథ్యంలో, దానిని అడ్డుకోవాలని, ప్రజల మనసుల్లో విషం నింపేందుకు దురుద్దేశంతో ఆరోజు ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు.  త్వరలోనే రామతీర్థం నిందితులను పట్టుకుంటాం. దుష్ట శక్తుల కుట్రలను ఛేదిస్తాం. 
 
ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి మత విద్వేషాలకు తావు లేదు, అందరూ ఏక కంఠంతో మత సామరస్యాన్ని కాపాడేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం" అని పేర్కొన్నారు
 
తిరుమల తిరుపతి ఆలయం ప్రధాన అర్చకులు వేణు గోపాల దీక్షితులు మాట్లాడుతూ.. " రాష్ట్రంలో అన్ని మతాలవారు సమన్వయంతో, వారివారి మతాలను గౌరవించుంటూ, వారి మత విశ్వాసాలను పాటించుకుంటూ, ఇతర మతాల వారికి ఇబ్బంది లేకుండా రాష్టాభివృద్ధికి తోడ్పడుతూ రాష్ట్రం శాంతియుతంగా ఉండేందుకు సహకరించాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు
 
షామీరీయా పీఠాధిపతి అహ్మద్ షేక్ బీన్ షబీన్ మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ లో కులం, మతం, ప్రాంతం అన్న భేదం లేకుండా సర్వ మతాలను గౌరవిస్తూ, అందర్నీ ఆదరిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో  సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని అభినందిస్తున్నాను" అని పేర్కొన్నారు
 
ఏఈఎల్సీ మోడరేటర్, బిషప్ ఏలియా మాట్లాడుతూ.. "దేవుడు మానవులను సృష్టించినప్పుడు మనమంతా ఒక్కటే అని చాటి చెప్పారు. సర్వమానవ సౌభ్రాతృత్వమే సమాజానికి కావాల్సిన సందేశం. దేవుని రాజ్య పరిపాలనలో మానవడు అందరితో కలిసి జీవించటానికి అందరికీ  పచ్చదనం, ఆనందం, ఆరోగ్యం అందించాడు. ఏ మతాన్ని కూడా ద్వేషించటానికి వీల్లేదు, అటువంటి చర్యలు ఎవరు చేసినా తప్పే. ఆంధ్ర రాష్ట్రాన్ని దేవుడు దీవించాలి. మత మౌఢ్యానికి, విద్రోహానికి మతాన్ని ఎవరూ వాడుకోకూడదు" అని పేర్కొన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు