ఏపీ పురపాలక శాఖామంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ కుమార్ హైదరాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. అతనిపాటు.. అతని స్నేహితుడు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 36లో మెట్రో రైల్ పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ కారు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. కాగా, రోడ్డు ప్రమాదంలో పిల్లర్‌ను ఢీ కొట్టిన సమయంలో కారు 200 కిమీ వేగంతో నడుస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నో జాగ్రత్తలతో తయారైన రూ.2.50 కోట్ల విలువైన మెర్సిడెస్ ఏఎంజీ జీ63 కారు కూడా వారిని రక్షించలేకపోయిందని తెలుస్తోంది. దెబ్బతిన్న కారును చూసిన నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
లగ్జరీ కారు ప్రయాణానికి అవసరమైన పూర్తి హంగులతో ఉంటుందని, సౌకర్యవంతమైన కారులో కాళ్లు చాపుకునే సౌకర్యం కూడా ఉంటుందని, అలాగే ప్రమాదం జరిగినప్పుడు రక్షణగా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని వారు చెబుతున్నారు. అలాంటి కారు కూడా ఘోరంగా ధ్వంసమైందంటే వారు మితిమీరిన వేగంతో వెళ్తున్నారని అంచనా వేశారు. అలాగే ఈ కారులోని ఎయిర్ బ్యాగ్స్ కూడా బరెస్ట్ అయిపోగా, ఛాసిస్ లోపలికి నొక్కుకుపోయిందని అంటున్నారు. ఇలాంటి కారు కూడా వారిని రక్షించలేకపోయిందంటే...వారి వేగం అత్యంత ప్రమాదకరమని వారు చెబుతున్నారు.
ఈ అత్యాధునిక కారు స్పెషాలిటీస్‌ను పరిసీలిస్తే... ఈ కారు మోడల్ - మెర్సిడెస్ ఏఎంజీ జీ63. దీని ధర రూ.2.50 కోట్లు. కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఇంజిన్ ఎనర్జీ - 420 కిలోవాట్... హార్స్ పవర్ - 571, ఇంజిన్ కెపాసిటీ - 5461 సీసీ, ఈ కారుకు ఏడు గేర్లు ఉంటాయి.
అలాగే, కారుకు 8 సిలిండర్లు... 6400 ఆర్ పీఎం కాగా, కారు పొడవు - 4.6 మీటర్లు, ఎత్తు 1.9 మీటర్లు, బరువు 3200 కేజీలు. యూరో6 ప్రమాణాలతో ఈ కారు తయారు కాగా, ప్రపంచంలోని అత్యుత్తమ కార్లలో ఇది ఒకటి. పైగా, ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు... అత్యున్నత రక్షణ వ్యవస్థను కలిగివుంది. అలాంటి కారు ప్రమాదానికి గురికావడం అందులో ప్రయాణిస్తున్న వారు దుర్మరణం చెందడం తీవ్ర విషాదానికి గురి చేసింది.