వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

ఠాగూర్

ఆదివారం, 27 జులై 2025 (15:36 IST)
గత వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తామని ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సింగపూర్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్... సింగపూర్ ఓవిస్ ఆడిటోరియంలో ఏపీఎన్ఆర్ఆ ఆధ్వర్యాన నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి మంత్రి లోకేశ్ అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంత నష్టపోయిందో, అంతకు అంత వడ్డీతో కలిపి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
 
ఆయన ఇంకా మాట్లాడుతూ, ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ఎంతలా నాశనమైందో మీకు తెలుసు... రాష్ట్ర పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ఎంత కష్టపడుతోందో మీరంతా చూస్తున్నారు.... చంద్రబాబు పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న నమ్మకమే మన పెట్టుబడి... మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలను ప్రచారం చేసి పెట్టుబడులు రాబడదామన్నారు.
 
ప్రతి దేశానికి, వస్తువుకు ఒక బ్రాండ్ ఉన్నట్లే, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అంటే సీబీఎన్ బ్రాండ్ అని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ బ్రాండ్ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా పెట్టుబడులు వస్తాయని, రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే తమ ప్రయత్నాలకు ఎన్ఆర్ఐల సహకారం అవసరమని కోరారు. సింగపూర్‌ను ఆదర్శంగా తీసుకుని నూతన పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్నామని, వేగంగా వ్యాపారం చేసేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నామన్నారు. 
 
దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, భూములు వంటి అపారమైన వనరులు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని, ఇది పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుందని చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వ, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయని, ఎస్ఆర్ఎం, విట్, అమృత వంటి విద్యాసంస్థలు వచ్చాయని, బిట్స్ పిలానీ త్వరలో రానుందని వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు