వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్

బుధవారం, 22 జులై 2020 (16:13 IST)
వైకాపా సీనియర్ నేత, ఎమ్మెల్యే, ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ వైరస్ బారినపడి, హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే. 
 
ఇప్పుడు తాజాగా పార్టీ కీలక నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కూడా కరోనా నిర్ధారణ అయింది. టెస్టుల్లో పాజిటివ్ అని తేలిన వెంటనే ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లి, వైద్యం చేయించుకుంటున్నారు. 
 
కాగా, గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే అంబటి కావడం గమనార్హం. ఇప్పటికే తెనాలి ఎమ్మెల్యే శివకుమార్, పొన్నూరు ఎమ్మెల్యే వెంకట రోశయ్యలను కరోనా వైరస్ కాటేసిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, సత్తెనపల్లిలో ఇప్పటివరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించాలని అధికారులను కోరిన అంబటి.. చివరకు ఆ వైరస్ బారినపడి క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. 
 
జిల్లా కలెక్టర్‌కు కూడా కరోనా
ఇదిలావుంటే, గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజు దాదాపు 500కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు వేలు దాటిపోయింది. ఇప్పటివరకు 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
మరోవైపు ఏకంగా జిల్లా కలెక్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో, ఆయన హోం క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. అంతేకాదు, కలెక్టర్ ఛాంబర్‌ను కూడా తాత్కాలికంగా మూసేశారు. జాయింట్ కలెక్టర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా వైద్య అధికారి, పలువురు జిల్లా అధికారులకు కూడా ఇప్పటికే పాజిటివ్ రావడంతో వారంతా క్వారంటైన్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు