ఏయ్ తమాషాగా ఉందా.. పిచ్చపిచ్చగా ఉందా.. ఏమనుకుంటున్నావ్.. నీ జాతకమంతా నా కంప్యూటర్లో ఉంది జాగ్రత్త... అంటూ 1990ల చివర్లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రంకెలేస్తే చాలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, నాయకులు లాగూలు తడిసిపోయేవి. అంతగా పార్టీమీదా, ప్రభుత్వం మీదా పట్టు సంపాదించిన చంద్రబాబుకు అప్పట్లో తిరుగులేదు. ఒక మాట ఆయన ఫైనల్ చేశారంటే ఇక అది చండశాసనమే.. ధిక్కరించారా.. ఎంతటివాడైనా సరే శంకరగిరి మాన్యాలు పట్టిపోవలసిందే.
తిరుగులేని ఆ అధికారం ఇప్పుడేమైంది. కనుసైగ చేస్తే చాలు ఆజ్ఞగా భావించి శిరసాహించిన ఆ విధేయత, భయంతో కూడిన వినయ గౌరవం ఇప్పుడేమయ్యాయి. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం చరిత్రలో కనీ వినీ ఎరుగని తిరుగుబాటు ఇది. మంత్రి పదవులు ఇవ్వలేకపోతే ఒకప్పుడు కిమ్మనకుండా తలొంచుకుని పోయిన ఆ భీరుత్వం ఏదీ.. తెలుగుదేశం పార్టీలోని చోటామోటా నాయకులు కూడా ఇప్పుడు బాబుపై తిరగబడుతున్నారు. బొజ్జలతో మొదలైన తిరుగుబాటు చింతమనేని ప్రభాకర‌్ వీరంగంతో తారాస్తాయికి చేరుకున్నా కంట్లోల్ చేయడం ముఖ్యమంత్రికి సాధ్యం కాలేదా అనే అనుమానాలు బయలుదేరుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు వీర విధేయుడిగా పేరుపడిన చింతమనేని వినిపిస్తున్న ధిక్కారస్వరం టీడీపీ వర్గాలకే షాక్ కలిగిస్తోంది.
మంత్రిపదవి ఇవ్వలేదన్న దుగ్ధతో రాజీనామా అస్త్రం ప్రయోగించిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కాస్త చల్లబడినట్లు కనిపించినా మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిస్తోంది. బుధపారం ఆయన మళ్లీ అలకపాన్పు ఎక్కారు. తనకు ఇద్దరు గన్‌మెన్లు చాలంటూ.. ఇద్దర్ని వెనక్కి పంపేశారు. ఆయనకు టూ ప్లస్ టూ లెక్కన నలుగురు గన్‌మెన్లు భద్రత కోసం ఉండగా ఇద్దరిని ఇప్పుడు వెనక్కు పంపారు. పైగా తనకు ప్రజలే రక్షణగా ఉంటారని, గన్‌మెన్ల భద్రత అవసరం లేదని చెప్పడం మరీ విశేషం.
చింతమనేని ఏం చేయాలనుకుంటున్నారు, తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఏవిధంగా ముందుకు వెళతారనే అంశాలపై చిక్కుముడి వీడటం లేదు. ఈ మధ్య అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జగన్ తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని అసెంబ్లీ ఆవరణలో దగ్గరికి పిలిపించుకుని మాట్లాడిన తర్వాత చింతమనేని జగన్‌పై ఒక్కమాట మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. దీనివెనక మతలబు ఏంటో తరిచి చూస్తే భవిష్యత్తులో టీడీపీ గెలవడం సాధ్యం కాదనిపిస్తే వైకాపాలోకి జంప్ చేయడానికి కూడా చింతమనేని సిద్ధమైపోయారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.