చిన్నారి అయేషా మృతి బాధాకరం: ఎమ్మెల్యే కిలారి రోశ‌య్య‌

బుధవారం, 13 అక్టోబరు 2021 (16:26 IST)
ముక్కుపచ్చలారని చిన్నారి అయేషా మృతి బాధాకరమని, తనను ఎంతగానో కలచి వేసిందని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మృత్యువు డెంగీ మహమ్మారి రూపంలో వచ్చి చిన్నారిని కబళించి వేసిందని విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దురదృష్ట ఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరు తగుజాగ్రత్తలు పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం కావాలని ఎమ్మెల్యే సూచించారు. 
 
బుధవారం తన కార్యాలయంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మీడియాతో మాట్లాడుతూ, కరోన రక్కసి చేసిన గాయాలు మానక మునుపే సీజనల్ వ్యాధులు విజృంభించే పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి మండల స్థాయి అధికారి వరకూ ప్రతిఒక్కరు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజారోగ్యం - పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ప్రత్యేకించి వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తగుసూచనలను చేయాలని తెలిపారు. అయేషా కుటుంబ సభ్యులకు జరిగినటువంటి నష్టం నియోజకవర్గంలో మరే కుటుంబానికి జరగకుండా ఉండేందుకు మన మందరం శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. అయేషా కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య భరోసానిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు