కొండ మీద ఆ దుర్గమ్మ ఉన్నంత కాలం కేశినేని భవన్ ఇక్కడే!

మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (17:33 IST)
తాను ఎప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటాన‌ని విజయవాడ ఎంపి కేశినేని నాని వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో నాని పోటీ చేయరనే ప్రచార పర్వం నేపథ్యంలో ఆందోళ‌న‌తో పెద్ద ఎత్తున మంగళవారం  కేశినేని భవన్ కి వచ్చిన కార్యకర్తలు చేరుకున్నారు. కార్యకర్తలతో ఎంపీ నాని ముచ్చటిస్తూ, ఏమాత్రం ఆందోళన చెందవద్ద‌ని, తాను ఎప్పుడు మీతోనే అని భరోసా ఇచ్చారు.  బెజ‌వాడ ఇంద్ర‌కీలాద్రి కొండ మీద దుర్గమ్మ ఉన్నంత కాలం కేశినేని భవన్ ఇక్కడే ఉంటుందన్నారు. 
 
2024 ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని కార్యకర్తలు నానిని కోరగా, వాళ్ళ ముగ్గురిని చంద్రబాబు కట్టడి చేయాలని, లేకపోతే తాను పక్కకు తప్పుకుంటాన‌ని తెలిపారు. 2014 ఎన్నికల్లో టీంటీడీపీ పేరుతో నగరంలోని నాయకులందరినీ ఏక‌తాటిపైకి తీసుకొచ్చానని, వారి స్వార్ధ ప్రయోజనాల కోసం పార్టీని నాశనం చేశారని కార్యకర్తలతో కేశినేని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
 
నేను చేసిన తప్పేంటి? కష్టపడ్డ కార్యకర్తలకు కార్పొరేటర్ సీట్లు ఇవ్వటమేనా? అని ప్రశ్నించారు. ఒక ముస్లిం కోసం, ఒక బీసీ కోసం, ఒక బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం, వారికి నేను అండగా ఉన్నాను అని తెలిపారు. తనపై  చేసిన విమర్శల్లో సగం మంత్రి వెల్లంపల్లి అవినీతి మీద పోరాటం చేసినా పార్టీకి మేలు జరిగేదన్నారు. మంత్రి వెల్లంపల్లి ప్రతి రోజూ చంద్రబాబుని, లోకేష్ ని తిడుతున్నా, వీళ్ళకది కనపడదన్నారు. ఎవరికి నష్టం జరిగింది? కార్యకర్తలే నష్టపోయారు... ఎన్నో ఏళ్లుగా పార్టీకోసం కష్టపడి జెండా మోసిన కార్యకర్తలు ఆస్తులు అమ్ముకుని స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారన్నారు. 
 
పశ్చిమలో ఎంతో మంది క్రమశిక్షణ కలిగిన సీనియర్ కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉండగా, వారిని వాడుకుని పార్టీ అధికారంలో వచ్చాక ఎవరికైనా ఆ ఇద్దరు నాయకులు న్యాయం చేసారా అని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు