రాజమండ్రి: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తన మొండిపట్టు వీడటంలేదు. దీక్షను వీడలేదు... తుని ఘటనలో అరెస్ట్ చేసిన తమవారిని విడుదల చేసే వరకు తాను వైద్యానికి సహకరించనని ముద్రగడ స్పష్టం చేశారు. దీనితో ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులతో చేస్తున్న ఆమరణ నిరహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. గురువారం సాయంత్రానికి ముద్రగడ ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఇటు అధికారులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం కాస్త నిలకడగా ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఆయన ఆరోగ్యం బుధవారం రాత్రి ఆందోళనకరంగా మారడంతో రాజమండ్రి అర్బన్ ఎస్పీ రాజకుమారి, డాక్టర్లు ముద్రగడను సముదాయించారు. వారి కోరికను మన్నించి సెలైన్ తీసుకోవడానికి ముద్రగడ అంగీకరిండంతో శుక్రవారం తెల్లారేసరికి మూడు లీటర్ల సిలైన్ ఎక్కించారు. దీనితో ముద్రగడ ఆరోగ్యం నిలకడగా వుందని డాక్టర్ రమేష్ కిషోర్ శుక్రవారం ఉదయం 8 గంటలకు తెలిపారు.
నిన్న రాత్రి ఎమర్జెన్సీ ఐతే రాజమండ్రి జిఎస్.ఎల్ ఆస్పత్రికి గానీ, బొల్లినేని ఆస్పత్రికిగా తరలించేందుకు ప్రయత్నం చేశారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం, ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు డాక్టర్ల బృందం ప్రయత్నం చేసినా ఆయన ఒప్పుకోకపోవడంతో గురువారం రాత్రి 8 గంటలకు ఇవ్వాల్సిన హెల్త్ బులిటెన్ కూడా డాక్టర్ల బృందం వెల్లడించలేదు. ముద్రగడ ఆరోగ్యం బాగా విషమించిందని ఎంత బతిమిలాడుతున్నా ముద్రగడ ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడానికి అంగీకరించడం లేదన్న సమాచారంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఇదిలావుంటే ముద్రగడ డిమాండ్ చేస్తున్నట్టు తుని ఘటనలో అరెస్టు చేసిన వారికోసం జేఏసి బెయిల్ పెట్టింది. ఈ రోజు బెయిల్ మంజూరు అయితే ముద్రగడ దీక్ష విరమించే అవకాశం వుంది.