తెలుగుదేశం పార్టీకి నా అల్లుడు సేవలు అద్భుతంగా ఉన్నాయనీ, ఈ సేవలను గుర్తించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందిస్తూ... పార్టీ కోసం నారా లోకేష్ అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు. కార్యకర్తలను, నేతలను సమన్వయపరుస్తూ ముందుకు సాగుతున్నారని చెప్పారు. అందుకే ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించిందని తెలిపారు.
ఇదిలావుండగా, తన అల్లుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేత, ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాలకృష్ణ దగ్గరుండి నామినేషన్ వేయించారు. సోమవారం శాసనసభ కార్యదర్శి కార్యాలయానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన లోకేష్, తన నామినేషన్ పేపర్లను ఎన్నికల అధికారికి అందించారు. లోకేష్ అభ్యర్థిత్వాన్ని కళా వెంకట్రావు, మంత్రి కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు బలపరిచారు.