తెలుగుదేశం పార్టీ… పాలనలో దాదాపు రెండున్నర సంవత్సరాలను పూర్తి చేసుకోబోతోంది. విభజన అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు.. రెండేళ్లుగా సాగిస్తున్న పాలన విషయంలో ఇప్పటికే వివిధ రకాల సర్వేలు, అధ్యయనాలు.. వెలుగులోకి వచ్చాయి. అయితే వీటిల్లో ఏదీ కూడా ఆథరైజ్డ్ సంస్థలు చేసినట్టుగా అధికారిక ధ్రువీకరణలు లేవు. కానీ.. తన పాలన విషయంలో ఎప్పటికప్పుడు ప్రజాస్పందన తెలుసుకునే ఆసక్తి మాత్రం తెలుగుదేశం అధినేతకు ఉంది. ఇప్పటికే పలు ధఫాలుగా ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సర్వేలు చేయించుకున్నారు.
వీటన్నింటినీ పక్కన పెడితే... సాక్షాత్తు సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రహ్మణి చేయించిన సర్వేలో విస్మయకరమైన ఫలితాలు బయటపడ్డాయని సమాచారం. తెలుగుదేశం పార్టీతో ఏ మాత్రం సంబంధం లేకుండా.. ఎవరు చేయిస్తున్నారనే అంశంపై కూడా క్లారిటీ ఇవ్వకుండా ఒక థర్డ్ పార్టీ ద్వారా నారా బ్రహ్మణి ఈ సర్వేను చేయించినట్టుగా ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిపిన ఈ సర్వేలో తెలుగుదేశం పార్టీని కలవర పెట్టే ఫలితాలే వచ్చాయట. ఇప్పటి పరిస్థితుల్లోనే ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 57 సీట్లకు మించి సాధించదని.. ఈ అధ్యయనం తేల్చింది. బాబు పాలన విషయంలో తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉందనే విషయానికి అద్దం పడుతున్న ఈ అధ్యయన వివరాలు చంద్రబాబు దృష్టికే తీసుకెళ్లిందట బ్రహ్మణి. ఇదీ పరిస్థితి... అని ఆమె కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసినట్లు సమాచారం. బాబు పాలన మీద ప్రబలిన ప్రజా వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీలకి కలిసొచ్చే అంశమే అని.. 175 లో తెలుగుదేశం ప్లస్ బీజేపీల వాటా 57 సీట్లు మాత్రమే అని.. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు... అంటే అది వైసీపీనా, లేదంటే జనసేన అనేది మాత్రం క్లారిటీ లేదు. మొత్తమ్మీద తెదేపాకు షాక్ కొట్టడం ఖాయమని ఈ సర్వేలో తేలినట్టు తెలుస్తోంది.
ఇచ్చిన హామీలు సరిగా అమలు చేయకపోవడం, రాజధాని అంశం పూర్తిగా గందరగోళంగా మారడం, అవినీతి తారా స్థాయికి చేరడం.. కరువు పరిస్థితులు.. ఇవన్నీ కూడా బాబు పాలనపై వ్యతిరేకతను పెంచుతున్నాయని నివేదిక వచ్చిందట. అనుకూల మీడియాను ఆధారంగా చేసుకుని.. ఇంతలా ప్రచారం చేయించుకుంటున్నా, అంతా అదిరిపోతోందని అని చెప్పుకుంటున్నా.. అంతర్జాతీయ స్థాయి రాజధాని అంటూ విదేశాల పేర్లు వల్లెవేస్తున్నా.. రెండున్నరేళ్లలోనే 57 సీట్ల స్థాయికి వచ్చిందంటే.. ఇక మిగతా రెండున్నర ఏళ్ళలో ఏం చేయాలనే మీమాంశలో టీడీపీ అధిష్టానం పడినట్లే.