సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ ఫ్యాక్షనిస్టు వ్యాపారాలన్నీ తానే చేయాలని రాష్ట్రంలో ఉన్న మిగతా వారిని వేధిస్తూ భయపెడుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీపై పడ్డారని, రాష్ట్రంలో సిని ఇండస్ట్రీ లేకుండా చేయాలని చూస్తున్నారని నారా లోకేష్ విమర్శించారు. అంతేకాకుండా కొత్త రాజధాని విశాఖ అని ఏం పీకారని ఆయన ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఆయన సోదరుడి కుమారుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణలో ఇదే విషయం బట్టబయలు అవుతోందన్నారు. తనపై తప్పుడు కథనం రాసిన సాక్షి దినపత్రికపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన లోకేశ్.. ఆ కేసు విచారణ కోసమంటూ సోమవారం మరోమారు విశాఖ వచ్చారు. కోర్టు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్ వివేకాను హత్య చేయించిందెవరన్న విషయం సీబీఐకి సునీతారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉందని లోకేశ్ తెలిపారు. ఈ హత్యలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డే సూత్రధాని అని సాక్షులు తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారని కూడా ఆయన చెప్పారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు ధర్జాగా రోడ్లపై తిరుగుతోంటే.. ప్రజల కోసం పోరాడుతున్న టీడీపీ నేతలపై జగన్ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని ఆయన ఆరోపించారు.