ఆక్వా రంగం కూడా సంక్షోభంలో పడిందని, విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధర అధికం కావడం, రొయ్యల ధర తగ్గిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్రకటించాలని రైతులు తీసుకున్నారని నారా లోకేష్ తెలిపారు.
ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించకపోవడం విచారకరమని విమర్శించారు. ఫీడ్ కేజీకి రూ.20, మినరల్స్, ఇతర మందుల ధరలు 30 శాతం పెరిగినా సీఎం దృష్టికి ఈ సమస్య రాకపోవడం విచిత్రమేనని ఎద్దేవా చేశారు.
రొయ్యల రేటు ఏ కౌంటు అయినా కేజీ సుమారు రూ.70 నుంచి రూ.150 వరకూ తగ్గినా సీఎం నుంచి స్పందన శూన్యమని విమర్శించారు. ఆక్వా రంగానికి మేలు చేస్తానని హామీలు ఇచ్చిన మీరు జగన్.. అధికారంలోకి వచ్చాక ఫీడ్-సీడ్ యాక్ట్ తేవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని నారా లోకేశ్ చెప్పారు. ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు మాత్రమే సబ్సిడీ పేరుతో 80 శాతం మందికి సబ్సిడీలు ఎత్తివేయడం ముమ్మాటికీ ఆక్వా రైతులను ద్రోహం చేయడమేనని అన్నారు.
టీడీపీ గతంలో అన్నిరకాలుగా ఆక్వారంగానికి ప్రోత్సాహం అందిస్తే, జగన్ మాత్రం సబ్సిడీలు ఎత్తేసి సంక్షోభానికి కారకులయ్యారని ఆయన చెప్పారు. ఆక్వారంగం పట్ల వైసీపీ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన అన్నారు.