కేంద్రం మెడలు వంచే ఛాన్స్ ఇది.. వదులుకోవద్దు.. సీఎం జగన్‌కు హర్షకుమార్ వినతి

మంగళవారం, 14 జూన్ 2022 (12:19 IST)
త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా ఓట్లు అత్యంత కీలకంకానున్నాయని,  అందువల్ల కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి కావాల్సిన అన్ని పనులు చేయించుకునే అవకాశం ఇదేనని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో తటస్థంగా ఉండే దమ్ముకు సీఎం జగన్‌కు ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
వైకాపాకు ఏమాత్రం చిత్తశుద్ధి వున్నా రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తే కేంద్రం దిగివస్తుందని ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తదితర సమస్యలను పరిష్కరించుకోవచ్చని హర్ష కుమార్ అభిప్రాయపడ్డారు. 
 
రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికకు వైకాపా ఓట్లు కీలకమైనందున, దూరంగా ఉంటామని ఒక్క ప్రకటన చేస్తే చాలని, కేంద్రాన్ని డిమాండ్‌ చేయడానికి ఇదే బంగారం లాంటి అవకాశమన్నారు. కేసులకు భయపడి ఏమీ మాట్లాడకపోతే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినట్లేనన్నారు.
 
అయితే, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడి మాట్లాడకుంటే కనుక రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వారు అవుతారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ కేసుల భయంతో ప్రధాని మోడీకి గులాం చేసేందుకే మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు