ఇప్పటికైనా మనుషుల్లా ప్రవర్తించడి.. వైకాపా నేతలకు నారా రోహిత్ హితవు

సోమవారం, 16 అక్టోబరు 2023 (09:37 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విషయంలో వైకాపా నేతలకు హీరో నారా రోహిత్ ఓ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైన కక్షలు కార్పణ్యాలు మానుకుని మనుషుల్లా ప్రవర్తించండి అంటూ హితవు పలికారు. చంద్రబాబు ప్రజల సంపద, ఆయన్ను ప్రజలే రక్షించుకుంటారని ఆయన అన్నారు. ఇదే విషయంపై నారా రోహిత్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు నవ్యాంధ్రకు కలిపి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలందించిన చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉందన్నారు. తన రాజకీయ జీవితం అంతా ప్రజాసేవకే అంకితం చేసిన చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. 
 
'చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించారు. ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేక, భౌతికంగా ఇబ్బంది పెడుతూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. డీహైడ్రేషన్‌తో బాధపడుతున్న చంద్రబాబుకు తక్షణ వైద్య సాయం అవసరమని డాక్టర్లు చెపుతున్నా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. డాక్టర్లు ఇచ్చిన నివేదికను బయటపెట్టకపోవడంలో ఉన్న ఆంతర్యం కూడా ప్రజలకు అర్థమైంది. చర్మవ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు పట్ల ప్రభుత్వ పెద్దలు చేస్తున్న అవహేళన వ్యాఖ్యలు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారని గుర్తు చేశారు. 
 
74 ఏళ్ల వయసున్న ఆయనకు కనీస సౌకర్యాలు కల్పించడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రాకపోవడాన్ని ఏమనాలి? న్యాయస్థానాలు ఆదేశాలు ఇచ్చేంతవరకు వసతుల ఏర్పాటు కోసం వేడుకోవాలా? అంటూ నారా రోహిత్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రజల సంపద అని, ఆయనను ప్రజలే రక్షించుకుంటారన్నారు. మహోన్నత స్థాయి కలిగిన వ్యక్తిని ఇబ్బందులకు గురిచేస్తే సమాజం క్షమించదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికైనా కక్షలు, కార్పణ్యాలు వీడి మనుషుల్లా ప్రవర్తించండి... చంద్రబాబుకు అవసరమైన వైద్యసాయం అందించండి అంటూ నారా రోహిత్ ఓ ప్రకటనలో కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు