'మన్ కీ బాత్‌'కు మూడు నెలల విరామం.. ఎందుకో తెలుసా?

వరుణ్

ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (14:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి చేసే రేడియో ప్రసంగం మన్ కీ బాత్. ఇది దేశ వ్యాప్తంగా ఎంతో ప్రజాధారణ పొందింది. అయితే, దీనికి వచ్చే మూడు నెలల పాటు విరామం ఇవ్వనుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమానికి మూడు నెలల పాటు విరామం ఇస్తున్నట్టు ప్రధాని మోడీ వెల్లడించారు. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం 110వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. గతంలో మాదిరిగానే ఈ మార్చిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
 
'ఇప్పటివరకు నిర్వహించిన 110 ఎపిసోడ్‌లు ప్రభుత్వంతో ఎటువంటి ప్రమేయం లేకుండా నిర్వహించాం. దేశ సామూహిక శక్తి, విజయానికి ఈ ప్రసారం అంకితం' అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇది ప్రజల కార్యక్రమమని, ప్రజల కోసం ప్రజలచే రూపుదిద్దుకుందన్నారు. తదుపరి నిర్వహించేది 111వ ఎపిసోడ్‌ అని.. ఈ సంఖ్యకు విశిష్టత ఉందన్నారు. ఇంతకంటే గొప్ప విషయమేముంటుందని చెప్పారు. ఇదిలావుంటే, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ 'మన్‌ కీ బాత్‌' కార్యక్రమానికి విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు