జగన్‌కు కేంద్ర సహకారం అందిస్తాం : ప్రధాని మోడీ హామీ

ఆదివారం, 26 మే 2019 (14:26 IST)
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గంటకు పైగా సమావేశమయ్యారు. జగన్ వెంట వైకాపా ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (ఇద్దరూ రాజ్యసభ సభ్యులు), వైఎస్. అవినాశ్ రెడ్డి (కడప ఎంపీ), మిథున్ రెడ్డి (రాజంపేట)లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మరికొంతమంది వైకాపా నేతలు ఉన్నారు. 
 
ఈ భేటీ ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్. జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చ జరిపాము. ఆయన పదవీకాలంలో కేంద్రం నుండి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇచ్చాను" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
ఆ తర్వాత వైకాపా అధినేత జగన్ నేరుగా బీజేపీ చీఫ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు వెళ్లారు. అక్కడ ఆయనకు అధికారులు, ఏపీ భవన్ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అనంతరం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆయనకు పుప్పుగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిలు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు