సిఎస్‌గా నీలం సాహ్ని సేవలు అభినందనీయం: ఆదిత్యానాధ్ దాస్

గురువారం, 31 డిశెంబరు 2020 (20:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మెరుగైన సేవలు అందించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాద్ దాస్ పేర్కొన్నారు.ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్ని గురువారం పదవీ విరమణ చేశారు.

ఈసందర్భంగా గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆదిత్యానాధ్ దాస్ మాట్లాడుతూ కోవిడ్-19 ను సమర్థవంతంగా ఎదుర్కొవడంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్ధవంతంగా పనిచేయించడంతోపాటు ఆమె రాష్ట్రానికి మెరుగైన సేవలు అందించారని కొనియాడారు.

దేశంలోనే ఉత్తమ అధికారులుగా ఆంధ్రప్రదేశ్ అధికారులకు గుర్తింపు ఉందని ఆవిధమైన గుర్తింపును నిలబెట్టుకునేందుకు అధికారులంతా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు కృషి చేయాలని సూచించారు.నీలం సాహ్ని ఏపదివిలో ఉన్నా ఎంతో నిబద్ధతతో పనిచేశారని ఈసందర్భంగా సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన మంతా సమిష్టిగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేద్దామని సహచర అధికారులందరికీ ఆదిత్యానాధ్ దాస్ సూచించారు.

సిఎస్‌గా పదివీ విరమణ చేసిన నీలం సాహ్ని మాట్లాడుతూ 36 సంవత్సరాల క్రితం తాను టెక్కలిలో సబ్ కలక్టర్‌గా సర్వీసులో చేరి వివిధ హోదాల్లో పనిచేసి సిఎస్ గా పదవీ విరమణ చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.అన్నిటికంటే ముఖ్యంగా అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

తన కుటుంబ సభ్యులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వంత రాష్ట్రంగా భావిస్తారని నీలం సాహ్ని చెప్పారు.రాష్ట్రం లోని ప్రజలు ఇక్కడ అధికారులు,సిబ్బంది తోడ్పాటు చాలా సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు అందించిన సహాయ సహకారాలు తోడ్పాటుకు సర్వదా కృతజ్ణురాలునని  నీలం సాహ్ని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా నియంత్రించడంలో ముఖ్యమంత్రి దిశా నిర్దేశాలను సమర్థమంతంగా అమలు చేయడంలో అన్ని శాఖలు తనకు అన్ని విధాలా తోడ్పడినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ణతలు తెలిపారు.నూతన సిఎస్ గా బాధ్యతలు చేపట్టిన ఆదిత్యానాద్ దాస్ పరిపాలనా రంగంలో విశేష అనుభవం ఉందని ఆయన వివిధ శాఖల్లో పనిచేసి మెరుగైన అనుభవం గడించారని ఆయన నేతృత్వంలో రాష్ట్రం మరింత మెరుగైన రీతిలో అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

వీడ్కోలు సభకు అధ్యక్షత వహించిన సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో నీలం సాహ్ని దేశంలోనే ఉత్తమ సిఎస్ గా నిలిచారని కొనియాడారు.1997 నుండి నీలం సాహ్నితో తనకు అనుబంధం ఉందని ఆమె ఏ స్థాయిలో పనిచేసినా కష్టించి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారని గుర్తు చేశారు.

నూతన సిఎస్ ఆదిత్యానాధ్ దాస్‌కు పోలవరం ప్రాజెక్టుపై ఉన్న అవగాహన దేశంలోని ఏఅధికారికి లేదని చెప్పారు. అనంతరం సిఎస్‌గా పదవీ విరమణ చేసిన నీలం సాహ్నికి సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ పూలగుచ్చాన్ని అందించి దుస్శాలువ,జ్ణాపికతో ఘనంగా సత్కరించారు.

అలాగే నూతన సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ కు సాధారణ పరిపాలన శాఖ తరపును ఆశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పూలగుచ్చాన్ని అందించి దుస్శాలువ కప్పి జ్ణాపికతో సత్కరించారు.చివరగా ఈ కార్యక్రమానికి సర్వీసెస్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వందన సమర్పణ చేయగా కార్యక్రమంలో సమాచారశాఖ ఎక్స్అఫీషియో ప్రత్యేక కార్యదర్శి టి.విజకుమార్ రెడ్డితో పాటు పులువురు ఉన్నతాధికారులు,సచివాలయ సాధారణ పరిపాలన, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు