అబార్షన్ చేయించి కోర్కె తీర్చుకున్నాడు... ఆస్తి కోసం యువతి తల్లిని చంపేశాడు..
బుధవారం, 30 అక్టోబరు 2019 (11:39 IST)
హైదరాబాద్ నగరంలోని ద్వారకా నగర్‌లో రజిత అనే వివాహిత హత్య కేసులో సరికొత్త కోణం వెలుగు చూసింది. రజిత పేరుతో ఉన్న పది కోట్ల రూపాయల ఆస్తుల కోసం ఆమె కుమార్తెతో కలిసి హత్య చేశాడో యువకుడు. ఇందుకోసం రజిత కుమార్తెలోని బలహీనతను తనకు అనుకూలంగా మలచుకున్నాడు. ఆ తర్వాత తమ ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేసి పోలీసులకు చిక్కాడు.
ఈ కేసులో ప్రాథమిక విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కీర్తి తల్లిదండ్రులు శ్రీనివాస్‌రెడ్డి, రజితకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిర్నాముల, తుమ్మలగూడెం గ్రామాల్లో పదెకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉంది.
ప్రస్తుతం ఎకరం రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షలు పలుకుతోంది. ద్వారకనగర్‌లో రూ.70 లక్షలు విలువైన ఇల్లు ఉన్నది. ఈ ఆస్తులన్నింటినీ గమనించిన శశికుమార్.. రజిత కుమార్తె కీర్తిరెడ్డితో పరిచయం చేసుకొని ఆమె వ్యక్తిగత వివరాలను సేకరించాడు. ఆ తర్వాత ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.
అదేసమయంలో కీర్తిరెడ్డి తన ప్రియుడు బాల్‌రెడ్డితో సన్నిహితంగా ఉన్న సమయంలో గర్భం దాల్చింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా దాచిన కీర్తి అబార్షన్ కోసం శశికుమార్ సహాయాన్ని కోరింది. దీనిని అవకాశంగా తీసుకున్న శశి.. సహకరిస్తానని హామీ ఇవ్వడంతోపాటు ఆమెను లోబరుచుకుని తన శారీరక కోర్కెలు కూడా తీర్చుకున్నాడు.
ఆ తర్వాత వారిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఇది గమనించిన తల్లి రజిత.. బాల్‌రెడ్డితో పెండ్లి చేయడానికి నిర్ణయించుకున్నాక శశితో ఎందుకు తిరుగుతున్నావంటూ పలుమార్లు మందలించింది. కీర్తి ఈ విషయాన్ని శశికి చెప్పడంతో.. ఆస్తి దక్కదని భయపడిన అతను ఎలాగైనా రజిత అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు.
అదేసమయంలో తన తల్లిపై కీర్తిరెడ్డి పలుమార్లు తీవ్ర అసంతృప్తిని, కోపాన్ని శశి ముందు వెళ్లగక్కింది. దీన్ని తనకు అనుకూలంగా శశి మలుచుకున్నాడు. ఇదే అదునుగా ఈ నెల 19వ తేదీన రజితను ఆమె కుమార్తె కీర్తితో కలిసి దారుణంగా హత్య చేసినట్టు ప్రాథమిక విచాణలో వెల్లడైంది.
మరోవైపు, ఈ కేసులో ఇంకా కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసులు కీర్తిరెడ్డి, శశికుమార్‌ను విచారిస్తున్నారు. మొత్తం మూడు బృందాలు ఈ కేసు దర్యాప్తును చేపట్టాయి.