పెళ్లి కోసం ఆగస్టు నెల దాకా ఆగాల్సిందే... ముహూర్తాలు లేవ్...

ఆదివారం, 1 మే 2016 (17:26 IST)
సోమ‌వారం నుంచి వివాహాలకు బ్రేక్‌ పడనుంది. మౌఢ్యమి రాకతో సుమారు మూడు నెలల పాటు ముహూర్తాలు లేవు. సాధారణంగా వేసవిలో చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో పెళ్లిళ్లు అధికంగా జరుగుతాయి. రాములోరి కల్యాణం తరువాత వివాహాలు చేయడం ఆనవాయితీ. సంక్రాంతి వెళ్లాక, పంట ఇంటికొచ్చాక శుభకార్యాలు జరుపుకుంటుంటారు. చైత్ర మాసంలో 29వ తేదీనే చివరి ముహూర్తం. వచ్చే నెల రెండు నుంచి జూన్‌ 30 వరకు శుక్రమౌఢ్యమి రానుంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయరు. 
 
జూలైలో ఆషాడ మాసం వల్ల వివాహాలు జరగవు. ఈ లెక్కన ఆగస్టు మూడు వరకు అంటే దాదాపు వంద రోజులు ముహూర్తాలు లేవు. ఆగస్టులో శ్రావణ మాసం సందర్భంగా నాలుగు నుంచి 27 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. అప్పటివరకు పెళ్లిళ్లకు విరామమే. ఏప్రిల్‌లో పెళ్లిచూపులు పూర్తిచేసుకున్న చాలామందికి ఆగస్టులో మహూర్తాలు నిశ్చయమయ్యాయి. ఆగస్టులో వరసగా ముహూర్తాలు ఉండడంతో కల్యాణమండపం, బ్యాండ్లు, సన్నాయిమేళం, మైక్‌సెట్‌, విద్యుద్దీపాలంకరణకు విపరీతమైన గిరాకీ ఉండడంతో ముందస్తుగానే బుక్‌ చేసుకోవడం కనిపిస్తోంది. 
 
ఆగస్టు 6 నుంచి 27 వరకూ ముహూర్తాలు ఉండగా.... 28 నుంచి అక్టోబర్‌ 12 వరకు ముహూర్తాలు లేవు. సెప్టెంబర్‌ నెలలో గురు మౌఢ్యమి. ఈ మౌఢ్యమి సెప్టెంబర్‌ 11 నుంచి అక్టోబర్‌ 7వ తేదీ వరకు ఉంది. ఈ కాలంలో శుభకార్యాలు చేయరు. అక్టోబర్‌ 13 నుంచి డిసెంబర్‌ 14 వరకు వివాహాలు జరగనున్నాయి. ఈ ఏడాదిలో ఇవే వివాహ ముహూర్తాలు. ఈ మేరకు వివాహాలు జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 
 
నిలిచిపోనున్న వ్యాపారాలు
ముహూర్తాల పుణ్యమా అని రెండేళ్లుగా పెళ్లిళ్ల సీజన్‌లో వ్యాపారాలు సక్రమంగా జరగక తీవ్ర ఇబ్బందిపడుతున్నామని వ్యాపారస్థులు చెబుతున్నారు. సాధారణంగా వివాహాల సీజన్‌లో వస్త్రాలు, బంగారం, వెండి, ఇత్తడి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో రూ.కోట్ల వ్యాపారం జరుగుతుంటుంది. రెండేళ్లుగా ఈ సీజన్‌లో పెళ్లిళ్లు లేకపోవడం, ఒకే ముహూర్తాన వందలకొద్దీ వివాహాలు జరగడంతో సరైన వ్యాపారం జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. మైక్‌సెట్‌, విద్యుద్దీపాలకంకరణ, బ్యాండు, సన్నాయిమేళం వారు పెళ్లి ముహూర్తాలు లేక ఉపాధికి దూరమవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి