ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి ఉంటాయా?

మంగళవారం, 28 మే 2019 (14:19 IST)
నేడు తెలుగుదేశం పార్టీ వ్వవస్థాపక అధ్యక్షుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్.టి.ఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు లక్ష్మీ పార్వతి, మోత్కుపల్లి నర్సింహలు, పలువురు తెలుగుదేశం నేతలు నివాళులు అర్పించారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టిన ఘనత ఎన్.టి.రామారావుదని, అటువంటి మహానేతను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, తద్వారా ఎన్టీఆర్ హింసకు గురై మరణించాడని అన్నారు. ఎన్టీఆర్ పడిన ఆత్మఘోష ఈరోజు నెరవేరిందని తెలియజేశారు. చంద్రబాబు ఓడిపోవడం వల్ల ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని, కేవలం చంద్రబాబు నాయకత్వం వల్లే ఏపీలో టీడీపీ ఓటమి పాలయ్యందన్నారు.
 
తెలుగుదేశం జెండా చంద్రబాబునాయుడిది కాదని, నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రమే చెందుతుందన్నారు. టీడీపీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసి నందమూరి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్నారు. జగన్ నాయకత్వంలో ఏపీ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, అన్న ఎన్టీఆర్ ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డికి తప్పకుండా ఉంటాయన్నారు. తాజాగా మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలతో ఎన్.టి.ఆర్ ఆశీస్సులు జగన్‌కు ఎందుకుంటాయని విమర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు