ఎన్టీయార్ హెల్త్ యూనివ‌ర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్

గురువారం, 6 జనవరి 2022 (13:45 IST)
ఏ దేశం అభివృద్ధిలోనైనా విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇది ఒక దేశానికి వెన్నెముకగా వంటిదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.  విద్య మానవ వనరులను వృద్దికి తోడ్పడుతుందని,  దేశ పురోగతిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. నందమూరి తారక రామారావు ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించగా, విశ్వవిద్యాలయ కులపతి హోదాలో రాజ్ భవన్ దర్బార్ హాలు నుండి గవర్నర్ వెబినార్ విధానంలో ప్రసంగించారు. 
 
 
గవర్నర్ మాట్లాడుతూ, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పురోగతిని తీసుకురావడానికి ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుందన్నారు. ఉన్నత విద్య యొక్క పరిధి, డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, విద్యా సంస్థలలో ప్రపంచ ప్రమాణాలను ప్రోత్సహించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య సంబంధిత విభాగాలను ఒక గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు విద్యార్ధులకు అత్యున్నత స్ధాయి బోధనను అందించటం అభినందనీయమన్నారు. 
 
 
విద్యార్ధులు ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి అవసరమైన నిబద్ధత, సృజనాత్మకత, ప్రతిభ అలంబనగా ముందడుగు వేయాలన్నారు. వైద్య నిపుణులుగా సంపాదించిన జ్ఞానంతో సమాజానికి సేవ చేయడానికి కృషి చేయాలన్నారు. డిజిటల్ టెక్నాలజీలతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవడానికి కరోనా కారణమైందని, మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో విద్యారంగం పోరాడుతోందన్నారు. పరిశోధనలను ప్రోత్సహించటానికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి అభినందనీయమన్న గవర్నర్ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగేలా ప్రేరేపించడం ద్వారా వైద్య, అనుబంధ శాస్త్రాలలో మరింతగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నారు. వైద్య రంగంలో పరిష్కరించబడని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం, ఆహారపు అలవాట్లలో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వ్యవహరించటం ముఖ్యమన్నారు.  
 
పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించే దిశగా జాతీయ పోషకాహార సంస్ధతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవటం ముదావహమన్నారు. ఐటీ ఆధారిత పరీక్షా విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావటం, కాగిత రహిత పనితీరును ప్రదర్శించటం అనుసరణీయమన్న గవర్నర్, ఎన్ టిఆర్ - మెడ్ నెట్ కన్సార్టియం, డిజిటల్ గ్రంధాలయం అధిక నాణ్యత గల వైద్య సాహిత్యానికి ఆలంబన కావటం శుభపరిణామమన్నారు. 
 
 
వ్యక్తిగత శ్రేయస్సు కోసం శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా, ధ్యానం సాధన చేయాలని గవర్నర్ విద్యార్ధులకు సలహా ఇచ్చారు. నిత్య విద్యార్ధిగా ముందడుగు వేస్తే విజయం మీ బానిస అవుతుందన్నారు. నిజానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సామర్ధ్యం మీలో ఉందని, సరైన లక్ష్యాన్ని ఎంచుకుని మార్గం కష్టమైనప్పటికీ సాధనకు ప్రయత్నించాలని, గౌరవ ప్రదమైన జీవితం గడపాలని బిశ్వభూషణ్ హరిచందన్ వివరించారు. కొన్ని సమయాల్లో ఒంటరిగా ఉండటానికి, వైఫల్యాన్ని భరించడానికి కూడా సిద్ధం కావలసి ఉంటుందన్న నిజాన్ని మరువరాదన్నారు. 
 
 
కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన డా. బి.సి.రాయ్ అవార్డు గ్రహీత, జెమ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ ఛైర్మన్ డాక్టర్. సి. పళనివేలు, ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో-ఎంటరాలజీ అధినేత, డాక్టర్ బి.సి. రాయ్ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. డి. నాగేశ్వర రెడ్డిలను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తుమ్మలపల్లి కళా క్ష్రేతం నుండి విశ్వవిద్యాలయ ఉప కులపతి అచార్య శ్యామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు