'బిగ్ బాస్ రియాలిటీ షో'లో అశ్లీలత : సెన్సార్ ఉండాల్సిందేనంటున్న హైకోర్టు

గురువారం, 27 జులై 2023 (12:53 IST)
ఓ ప్రైవేట్ టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో చూపుతున్న అశ్లీలతపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ షో ప్రసారానికి ముందే సెన్సార్‌ చేయాల్సిందేనని స్పష్టమైన తీర్పునిచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షో అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు బుధవారం ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చాయి. సెన్సార్ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని, కాబట్టి ఇటువంటి షోలను రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటలలోపు ప్రసారం చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్ రెడ్డి వాదనలు వినిపించారు.
 
ప్రతిగా ఎండోమోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ తరపున సీనియర్ న్యాయవాది రఘు వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం షో ప్రసారం కావడం లేదని, ఇలాంటి సమయంలో ఈ వ్యాజ్యాలపై విచారణ అవసరం లేదని, కాబట్టి ఇకపై ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే మళ్లీ పిల్ వేసేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. 
 
అలాగే, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాటీవీ తరపున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బిగ్ బాస్ షో ప్రసారానికి ముందు సెన్సార్షిప్ విధానం లేదని, షో చూడడం ఇష్టం లేకపోతే చానల్ మార్చుకోవచ్చని సూచించారు. 
 
అన్ని వర్గాల వాదనలు ఆలకించిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కార్యక్రమానికి సెన్సార్షిప్ అవసరమేనని తేల్చి చెప్పింది. షో ప్రసారం అయ్యాక ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని నిలదీసింది. చానళ్లు అన్నీ ఇలానే అశ్లీల కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నా పర్యవేక్షించకూడదా? అని ప్రశ్నించింది. నైతిక విలువలు కాపాడుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. షో ప్రసారానికి ముందే సెన్సార్ విషయంలో కేంద్రానికి సూచనలు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
 
పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మాటీవీ, ఎండోమోల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, నటుడు అక్కినేని నాగార్జునలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాద్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు