గతంలో డాక్టర్ అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా ఏపీ పంచాయతీ రాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్ మార్చేశారు. అలాగే పల్లెల్లో తాగునీటి సౌకర్యం లేకుండా చేస్తానని కూడా నోరు జారారు. ఇలా తన ప్రసంగాల్లో అప్పుడప్పుడూ తడబడుతూ.. ప్రతిపక్ష నేతల విమర్శలతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కూడా సెటైర్లు కొనితెచ్చుకుంటున్న నారా లోకేష్.. తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కారు.
బుధవారం మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు 96వ జయంతి వేడుకల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. తెలుగు నేల నుంచి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ అప్పట్లో ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారంటూ కొనియాడారు. ఢిల్లీలో ఎంపీలతో కలిసి పీవీకి నివాళులు అర్పించిన నారా లోకేష్.. పీవీ అప్పటి ఆర్థిక సంస్కరణలతోటే ప్ర్రస్తుతం ఫలాలు అందుతున్నాయన్నారు. పీవీ తెలుగు ప్రజల నుంచి ప్రధాని అవుతున్నారనే కారణంగానే.. ఆ రోజు అన్న ఎన్టీఆర్ ఆయనపై పోటీ పెట్టలేదని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.