కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఊహించింది ఒకటైతే, జరిగింది మరొకటి. జిల్లా మొత్తంలో తమ గుర్తుపై గెలిచిన స్థానిక ప్రజాప్రతినిధుల బలం తమకే ఉంటుందని జగన్ గట్టిగా నమ్మారు. వారు ఏ శిబిరంలో వున్నా తమకే ఓటు వేస్తారని ఎక్కువగా విశ్వసించారు. ఆ విశ్వాసమే కొంపముంచింది.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు, కోడూరు ఎమ్మెల్సీ చెంగల్‌రాయుడు టీడీపీలోకి చేరడంతో భారీగా గండిపడింది. అంతకుముందు, ఆ తరువాత కడప జిల్లాపరిషత్‌లో జడ్పీటీసీలు, కడప కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్లు వైసీపీ నుంచి పదుల సంఖ్యలో టీడీపీతో జతకట్టారు.
ఓట్లను, అభిమానాన్ని, ప్రజాప్రతినిదుల సంఖ్యను చూసుకుని సంతృప్తి చెందితే ప్రత్యర్థి పక్షం అమాంతంగా అవకాశాలను లాగేసుకుంటుందని ఎన్నిసార్లు టీడీపీ నిరూపించినా ఓటర్లను మేనేజ్ చేయడంలో వెనుకబాటుతనమే జగన్ కొంప ముంచుతోంది. ఓటమికి ఎన్ని సాకులు వెతికినా అసలు లోపం తమలోనే ఉందని వైకాపా గ్రహించనంతవరకు ఇలాంటి ఎదురు దెబ్బలు తప్పవని జనం ఉవాచ.