మా పార్టీ కండువా కప్పుకుంటే బతికి బయటపడతారు : జట్టు - చీరలు లాగి మహిళలపై దాడులు

సోమవారం, 19 జూన్ 2023 (09:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం అధికార పార్టీ నేతలే కాదు అధికార పార్టీ నేతల అండ చూసుకుని చివరకు పోలీసులు కూడా రెచ్చిపోతున్నారు. ప్రధానంగా విపక్ష పార్టీ నేతలను వేధిస్తున్నారు. అధికార వైకాపాలో చేరాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక సాధారణ ప్రజానీకం దిక్కుతోచని స్థితిలో ఉంది. 
 
తాజాగ పల్నాడు జిల్లాలో పలువురు గిరిజన ప్రజలకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. "వైసీపీ కండువా వేసుకుంటేనే బతికి బయటపడతారు, లేకుంటే ఇబ్బందులు పడతారు" అంటూ పోలీసులు హెచ్చరించారు. ఈ విషయాన్ని బాధిత పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెం గిరిజనులు వాపోయారు. 
 
వారు ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 16న తురకపాలెంలో ఆక్రమంగా మద్యం విక్రయిస్తున్నారంటూ ఒక యువకుడ్ని పిడుగురాళ్ల సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడి సెల్‌ఫోనులో చెన్నాయపాలెం గ్రామానికి చెందిన భిక్షునాయక్, నరసింహ నాయక్ నంబర్లు ఉండడంతో వారిపైనా కేసులు నమోదు చేశామంటూ.. స్టేషన్‌కు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
 
దీంతో వారు సెబ్ కార్యాలయానికి వెళ్లారు. అక్రమ కేసులు పెట్టారని చెబుతున్నా పట్టించుకోకుండా తమ పైనా, మహిళలపైనా దాడిచేసి కొట్టారంటూ బాధితులు ఆరోపించారు. సివిల్ పోలీసులు వచ్చి పిడుగురాళ్ల స్టేషన్‌కు తీసుకెళ్లారని అక్కడ కూడా జుట్టు పట్టుకొని, చీరలు లాగి.. కులం పేరుతో దుర్భాషలాడుతూ కొట్టారన్నారు. 
 
వైసీపీ కండువా వేసుకుంటే బతికి బయటపడతారని లేకుంటే ఇబ్బందులు పడతారంటూ హింసించారని విలపించారు. నాలుగేళ్ల శ్రీనునాయక్ అనే బాలుడిపై పోలీసులు కారు పోనివ్వడంతో బాలుడి పాదం మీద తీవ్ర గాయమైందన్నారు. 14మందిపై అక్రమ కేసులు బనాయించారని, తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు