14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

ఐవీఆర్

గురువారం, 27 మార్చి 2025 (17:16 IST)
ఈ హోళీ పండుగ, బడాగావ్, ఉత్తరప్రదేశ్ వాస్తవ్యులైన - శ్రీ పున్వాస్ కన్నౌజియాకు, ఆయన కుటుంబానికి, నిజమైన ఆనందాన్ని, క్రొత్త రంగులతో కళకళలాడిన పండుగగా మారింది. 14 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కుమారుడు నీరజ్‌ను తిరిగి కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. స్వర్ణభారత్ ట్రస్ట్‌ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ గారి చొరవతో నీరజ్ తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నాడు. గూడూరు రైల్వే స్టేషన్‌లో సుమారు 8 ఏళ్ల వయసున్న నీరజ్‌ను రైల్వే పోలీసులు కనుగొని, వెంకటాచలం లోని స్వర్ణభారత్ ట్రస్ట్ నిర్వహిస్తున్న బ్రిడ్జ్ స్కూల్‌లో అప్పగించారు.
 
ఈ బ్రిడ్జి స్కూల్‌లో అనాథ పిల్లలు, పేద కుటుంబాల్లోని బడి మానేసిన, తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పిల్లల సంరక్షణ, వారి విద్యా బాధ్యతను చేపడతారు. అక్కడ నీరజ్ ఇతర పిల్లలతో కలిసి చదువుకున్నాడు. సుమారు 150 మంది బడి మానేసిన పిల్లలకు ఉచిత విద్య, భోజనం, యూనిఫాం, వసతి స్వర్ణ భారత్ ట్రస్ట్ కల్పిస్తుంది. తర్వాత శ్రీమతి దీపా వెంకట్ గారు వ్యక్తిగతంగా నీరజ్‌ను దత్తత తీసుకుని, అతని చదువు పూర్తయ్యేలా చూసి, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, డ్రైవింగ్, 2 & 4 వీలర్ మెకానిజం వంటి పలు నైపుణ్య శిక్షణలు కూడా ఇప్పించారు.
 
నీరజ్ తండ్రి శ్రీ పున్వాస్ కన్నౌజియా ఉపాధి కోసం తన ఇద్దరు కుమారులు ధీరజ్, నీరజ్‌తో కలిసి ముంబై వచ్చారు. వారణాసి లోని బడేగావ్‌లో భార్య, ఇద్దరు పెద్ద కుమార్తెలు, ఇద్దరు చిన్న కుమారులు వుండే వారు. అన్న ధీరజ్ చీరల డిజైనర్ వద్ద పనిచేస్తుండగా, తండ్రి లాండ్రీ షాపులో పనిచేసేవాడు. నీరజ్‌ని పక్కనే ఉన్న బేకరీలో పనికి పెట్టాడు. బొంబాయి చూద్దామని పట్టుబట్టిన నీరజ్‌ను నిలువరించడం తండ్రికి కష్టంగా ఉండేది, పైగా బేకరిలో వేడి వేడి పళ్ళాలు పట్టుకోవడంతో నీరజ్‌కి చేతులకి వాతలు పడేవి.
 
ఒక రోజు మధ్యాహ్నం, తండ్రి నిద్రిస్తున్న సమయంలో చెప్పా పెట్టకుండా నీరజ్ ఒక లోకల్ రైలెక్కాడు. ఆపై ముంబై సెంట్రల్ స్టేషన్‌లో మరో రైలెక్కాడు. దాదాపు రెండు నెలల పాటు వివిధ రైల్వే స్టేషన్లలో తిరుగుతూ, చివరికి ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు స్టేషన్‌ వద్ద దిగి తిరుగుతుండగా రైల్వే పోలీసులు గుర్తించి, ఇంటి నుంచి తప్పిపోయిన బాలుడని గ్రహించారు. నీరజ్ కేవలం హిందీ మాట్లాడగలిగేవాడు. అతని కుటుంబం గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించి విఫలమవడంతో, రైల్వే పోలీసులు అతన్ని వేంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ గారికి అప్పగించారు.
 
నీరజ్, బ్రిడ్జ్ స్కూల్‌లో చేర్చబడగా, అక్కడే తెలుగు నేర్చుకున్నాడు. హాస్టల్‌లోనే ఉండి, ఇతర విద్యార్థులతో కలిసి చదువుకుంటూ, పండుగలు కూడా అక్కడే జరుపుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత శ్రీమతి దీపా వెంకట్ గారు ఐదుగురు అనాథ బాలికలను దత్తత తీసుకున్నారు. నీరజ్‌ను అన్నయ్యలా భావించి వారు రక్షాబంధన్‌ రోజున రాఖీలు కట్టేవారు. నీరజ్ కుటుంబాన్ని గుర్తించేందుకు పలుమార్లు యత్నించినా, అతను చెప్పిన సమాచారంతో వారి ఆచూకీ దొరకలేదు. అక్టోబర్ 2024లో మేనేజింగ్ ట్రస్టీ కార్యాలయం వారు, ముంబై కురార్ పోలీసులకు సమాచారాన్ని అందించినా, పెద్దగా పురోగతి కనబడలేదు. కారణం, ఆధార్ కార్డులో నీరజ్ ఇంటి పేరు సరిగ్గా నమోదు కాకపోవటం.
 
హోళీ పండుగకు ఒక రోజు ముందు దీపా వెంకట్ గారు ట్రస్ట్ ప్రతినిధిని నీరజ్‌తో జత కలిపి ముంబై, మలాడ్ ఈస్ట్‌లో అతని తండ్రిని వెతకడానికి పంపించారు. కురార్‌కు చేరుకున్నాక, నీరజ్ తన తండ్రి పని చేసిన ప్రదేశాన్ని గుర్తించాడు. అతను పని చేసిన బేకరీ, పక్కనే ఉన్న చెరుకు రసం దుకాణం కనిపించాయి. అయితే, నీరజ్ గుర్తుపెట్టుకున్న సెలూన్‌ చోటులో, కొత్త భవనం నిర్మాణంలో ఉంది. స్థానిక పోలీసుల సహాయంతోనూ, చాలా కాలంగా ఉన్న వ్యాపారస్తులను సంప్రదించినా, పెద్దగా సరైన సమాచారం దొరకలేదు.
 
ఈ క్రమంలో, యూపీకి చెందిన ఒక పానీపూరి వ్యాపారి, సెలూన్ ఎక్కడకు మార్చారో తెలిపాడు. సెలూన్ యజమానిని కలుసుకున్నాక నీరజ్ తండ్రిని చూసి మాట్లాడి 12- 13 ఏళ్లైందని అన్నాడు. తన పాత ఫోను, ఫోను నంబర్లను కోల్పోయానని చెప్పాడు. కానీ, నీరజ్ వాళ్ళ గ్రామానికి వెళ్లే ఒక వ్యక్తి తెలుసని చెప్పాడు. బహుశా పండుగ హడావిడిలో, అతను ఆ సమయంలో స్పందించలేదు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్‌లో నీరజ్ ఫోన్ నంబర్‌ను కుటుంబ సభ్యుల వివరాలతో సహా ఫిర్యాదు నమోదు చేయించారు.
 
అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు, సెలూన్ యజమాని ట్రస్ట్ ప్రతినిధికి ఫోన్ చేసి, నీరజ్ కుటుంబానికి సమాచారం అందిందని, నీరజ్ తల్లిదండ్రుల నుండి ఫోను వస్తుందన్నారు. అంతలోనే, నీరజ్‌కు వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. స్క్రీన్‌పై తమ  కుటుంబ సభ్యులు ఒకరినొకరు చూసుకున్న మరుక్షణం - తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది, తండ్రి ఆనందానికి అంతులేదు, అవ్వ ఆనందబాష్పాలు రాల్చింది, తమ్ముళ్లు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. అక్కలు కూడా ఫోన్ చేసి మాట్లాడగా, దుబాయ్‌లో పని చేస్తున్న అన్నయ్య ధీరజ్ కూడా వీడియో కాల్ ద్వారా మాట్లాడాడు. 14 ఏళ్ల తర్వాత, నీరజ్ తన కుటుంబాన్ని తిరిగి కలుసుకున్నాడు!
 
ఈ అద్భుత సంఘటన గురించి తెలుసుకున్న దీపావెంకట్ గారు హర్షాతిరేకంతో స్పందించారు. ఆ సమయంలో ఆమె వారణాసిలోనే ఉండటంతో, ముంబై నుంచి నీరజ్‌ను, ట్రస్ట్ ప్రతినిధి ను విమాన టిక్కెట్లు బుక్ చేసి వారణాసి పిలిపించారు. నీరజ్ విమానాశ్రయం బయట అడుగుపెట్టగానే, తండ్రి పోలికలతో ఉన్న నీరజ్ ను కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించారు. తల్లి, తండ్రి, ఇద్దరు తమ్ముళ్లు, అక్క గట్టిగా కౌగిలించుకుని, చిన్న నాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారు... తన కుమారుడిని 14 ఏళ్ల పాటు కన్న తల్లి లాగా పెంచి, జీవితంలో సరైన మార్గాన్ని చూపించినందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. "నీరజ్ బ్రతికే ఉన్నాడని మేము అనుకోలేదు!" అంటూ కన్నీళ్లతో చెప్పారు.
 
ఆమెను బడేగావ్‌లో ఉన్న తమ ఇంటికి ఆమె బృందంతో కలిపి ఆహ్వానించారు. ఇది ఒక కుటుంబం ఎంతో కాలం పాటు వేచి చూసిన రోజు మాత్రమే కాదు... ఎల్లలు ఎరుగని ఆనందం, ఎన్నో రంగుల హర్షాతిరేకంతో జరుపుకున్న మరపురాని హోళీ పండుగ!!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు