తిరుమలతో పెట్టుకుంటే మాడి మసైపోవాల్సిందే : పరిపూర్ణానంద స్వామి (video)

బుధవారం, 23 సెప్టెంబరు 2020 (13:11 IST)
స్వామి పరిపూర్ణానంద ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల పెట్టుకునే ఎవరైనా సరే మాడి మసైపోవాల్సిందేనంటూ హెచ్చరించారు. ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమల కొండ గురించి విపరీత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన మండిపడ్డారు. 
 
హిందూ దేవాలయాల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి జగన్‌కు వినిపిస్తున్నాయో? లేదో? తెలియదని, సీఎం స్పందించకపోతే ఆయనే మాట్లాడించారని అనుకోవాల్సి వస్తుందన్నారు. 
 
తిరుమల దర్శనార్థం వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. తిరుమలపై ఇలాంటి వ్యాఖ్యానాలు గతంలో ఎప్పుడూ వినలేదని స్వామీజీ విస్మయం వ్యక్తం చేశారు. 
 
సాధారణంగా ఒక వివాదం చెలరేగితో అది సద్దుమణిగేలా చేసే బాధ్యత సంబంధిత మంత్రులపై ఉంటుందని, కానీ మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఇతర మతస్థుల ప్రార్థనా స్థలాల గురించి ఏ రాజకీయ నేతా మాట్లాడటం లేదని, కేవలం హిందూ దేవాలయాల గురించి మాట్లాడే హక్కు లేదని మండిపడ్డారు. 
 
మంత్రి కొడాలి నానికి ఏమాత్రం చరిత్ర తెలియదని, ఓసారి చరిత్రను తిరిగేయాలని స్వామీజీ హితవు పలికారు. 42 పాయింట్లతో డిక్లరేషన్ రూపొందించారని, ఇతర మతస్థులు దర్శనార్థం వెళితే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.
 
కొడాలి నానీ భ్రమల నుంచి బయటికి రావాలని హెచ్చరించారు. గతంలో ఓ పార్టీలో ఉండేవారని, ప్రస్తుతం మరో పార్టీలో ఉన్నారని, త్వరలో కొడాలి నానికి ఈ పార్టీపై ఉన్న భ్రమలు కూడా తొలిగిపోయి, ఇతర పార్టీలోకి వెళ్తారని స్వామీజీ ఎద్దేవా చేశారు. తిరుపతి ఎవడబ్బ సొత్తు అనడం చాలా దారుణమైన అంశమన్నారు. 
 
తిరుమల డిక్లరేషన్‌పై ప్రశ్నించడం అహంకారమే అవుతుందన్నారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని మండిపడ్డారు. తిరుమల కొండతో పెట్టుకున్న వారి బూడిద కూడా దొరకలేదని, ఆ చరిత్ర కూడా కళ్లముందే ఉందని గుర్తుచేశారు. దేవుళ్లతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతారని హెచ్చరించారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు