జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో శనివారం పర్యటించనున్నారు. ఈ పర్యటన కోసం శుక్రవారం రాత్రికే పవన్ మంగళగిరి చేరుకుంటారు.
జనసేన ప్లీనరీ సమావేశానికి ఇప్పటం గ్రామస్తులు తమ పొలాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు గ్రామంలో 120 అడుగుల రోడ్ నిర్మిస్తామంటూ దారిలో ఉన్న ఇళ్లననింటినీ కూల్చేస్తున్నారు. జనసేన వర్గీయులు అన్న కారణంగానే ఇళ్లను కూల్చేస్తున్నారని ఆరోపించారు.
ఇటీవల ఇప్పటం గ్రామస్తులు పవన్ కల్యాణ్‌ను కలిశారు. ప్రభుత్వానికి భయపడకుండా ప్లీనరీకి స్థలాలు ఇచ్చినందుకు పవన్ కల్యాణ్.. గ్రామానికి యాభై లక్షల విరాళం ఇచ్చారు. దాంతో వారు ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించుకున్నారు.
అయితే దానికి బలవంతంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. దీనిపై మూడు రోజుల కిందట.. ఆ గ్రామంలో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అప్పుడు కరెంట్ నిలిపివేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇప్పటం ఇళ్ల తొలగింపు అంశంపై పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో స్పందించారు.
రోడ్డు విస్తరణ పేరుతో వైసీపీ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందని పవన్ మండిపడ్డారు. బాధితులకు అండగా నిలబడాలని .. ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.