భవిష్యత్‌లో ఏపీ మూడు ముక్కలవుతుందా? పవన్ ఏమన్నారు...

శుక్రవారం, 1 జూన్ 2018 (05:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్‌లో మూడు ముక్కలవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనికిగల కారణాలను కూడా ఆయన వివరించారు. నవ్యాంధ్ర పేరుతో అమరావతి, విజయవాడ, గుంటూరులోనే అభివృద్ధి చేస్తే మళ్లీ రాష్ట్ర విభజన ఉద్యమం మొదలుతుందని ఆయన హెచ్చరించారు. 
 
జనసేన పోరాట యాత్రలో భాగంగా, గురువారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో నిరసన కవాతు నిర్వహించి ఆయన, ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలా ఇక్కడ కళింగాంధ్ర ఉద్యమం మొదలయ్యే అవకాశం లేకపోలేదన్నారు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో బలపడుతుందన్నారు. 
 
అందువల్ల ఉత్తరాంధ్రతోపాటు రాయలసీమలను ఏపీ సీఎం చంద్రబాబు పట్టించుకోకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రగా మూడు ముక్కలవుతుందని ఆయన హెచ్చరించారు. అప్పట్లో హైదరాబాద్‌లో చేసిన తప్పే మళ్లీ ఇక్కడ చేస్తున్నారని, అభివృద్ధి ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతమయ్యేలా చేస్తున్నారని మండిపడ్డారు. 
 
ఉద్ధానం సమస్య జనసేన వల్లే బయటకు వచ్చిందని, నాలుగేళ్ల క్రితం పెట్టిన పార్టీ ఇంత చేయగలిగినప్పుడు ఇన్నేళ్లుగా ఉన్న పార్టీలు, ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయాయని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్క పాలకులకు లేదన్నారు. అధికారంలోకి రాకముందు ఒకమాట.. వచ్చాక మరోమాట చెప్పడం ఆనవాయితీగా మారిందన్నారు.
 
కలుషిత మంచినీటికి సంబంధించి చంద్రబాబు సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు. తనకు జనసైనికుడు అందించిన వాటర్ బాటిల్‌ని జనానికి చూపిస్తూ.. 'ఇవి పార్వతీపురం నీళ్లు. మన ఊరి నీళ్లు. ఒక పని చేయండి. మినరల్ వాటర్ తాగడం మానేసి.. పార్వతీపురం నీళ్లు తాగమని ముఖ్యమంత్రి గారికి చెప్పండి' అంటూ చురకలంటించారు. 'అప్పుడు మన బాధలు తెలుస్తాయి. కలుషితమైన ఈ నీళ్లతో.. కలరాలు రావా' అని ప్రశ్నించారు. 'పార్వతీపురం ఎవరొచ్చినా.. సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం నేతలు అందరికీ ఇవే నీళ్లు ఇవ్వండి' అని జనసైనికులకు పవన్ కళ్యాణ్ సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు