గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జరిగింది. ఇందులో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అదిరిపోయే ప్రసంగం చేశారు. వైకాపా నేతలను, పాలకులను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు పేల్చారు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాల్లో ఇదే హైలెట్ అని ఇప్పుడో సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అంతేకాకుండా "కూల్చేవాడుంటే కట్టేవాడుంటాడు. విడదీసేవాడుంటే కలిపేవాడుంటాడు. చీకట్లో తోసేవాడుంటే వెలుగులోకి లాక్కొచ్చేవాడుంటాడు. తలెగెరేసే పాలకుడుంటే ఎగిరి తన్నే పరశురాముడు ఉంటాడు. దోపిడీ చేసే వైసీపీ గూండాగాళ్లు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జనసైనికులు ఉంటారు. వైకాపాది విధ్వంసం.. జనసేనది వికాసం. వారిది ఆధిపత్యం మనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డా.. ఇది జనసైనికుల గడ్డ.. జై జనసేన" అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం ముగించారు.