సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. శుక్రవారం రాత్రి కూడా ఆస్పత్రిలోనే ఉండనున్నారు. ఇంటర్నేషనల్ షూట్‌లోని ప్రత్యేక రూమ్‌లో రజనీకాంత్‌కు వైద్య సేవలు అందిస్తున్నారు. కేవలం ఒక్క డాక్టర్ పర్యవేక్షణలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ కే.హరిబాబు నేతృత్వంలోని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కుదటపడితే శనివారం ఉదయం డిశ్చార్ చేస్తామని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నందున అభిమానులు ఎవరూ ఆస్పత్రి వద్దకు రావద్దని వైద్యులు కోరారు. కాగా అన్నాత్తే సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్‌లో పలువురు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం రక్తపోటు అధికం కావడంతో వెంటనే నగరంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. రజనీకాంత్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరినట్టు తెలియగానే బాధపడ్డాను. ఆయనకు కరోనా లక్షణాలేమి లేవని డాక్లరు చెప్పడం ఉపశమనం కల్పించింది. మనోధైర్యం ఉన్న రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఆయన ఎంతో ఆరాధించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో మనముందుకు తిరిగిరావాలని కోరుకుంటున్నట్టు సందేశంలో పేర్కొన్నారు.