పదేపదే తన కులాన్ని తెరపైకి తెస్తున్న రాజకీయ నేతలకు హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక చేశారు. తన కులాన్ని పదేపదే ప్రస్తావిస్తే మీ ఆఫీసుల్లో పనిచేసేవారి కులాలను లెక్కించాల్సి వస్తుందన్నారు. అదేసమయంలో బలప్రదర్శనతో కాపు రిజర్వేషన్లు రావన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా బలప్రదర్శనతో రాలేదన్నారు. ఉద్యమం అనేది నిర్మాణాత్మకంగా సాగాలని హితవుపలికారు.
రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమై వారినుద్దేశించి పవన్ మాట్లాడుతూ, "కాపు రిజర్వేషన్లు చేస్తే బీసీలు గొడవపడతారు.. విధ్వంసం జరుగుతుందని కొందరు అన్నారు. కాపులకి బీసీలు వ్యతిరేకమని ఎందుకు అనుకుంటున్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో చేర్చినపుడు బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్యకు గుర్తుకు రాలేదా? ఇదెక్కడి ద్వంద్వ నీతి అంటూ ప్రశ్నించారు.
అందువల్ల నాపై విమర్శలు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ప్రజారాజ్యం పార్టీలాగా, ఆ పార్టీలో చేరిన కొందరు వ్యక్తుల్లాగా నేను బలహీనమైన వ్యక్తిని కాదు. చిరంజీవి అంత మంచితనం నాలో లేదు. దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోండి. చిరంజీవిగారికి చాలా సహనం ఉంది పడతారు. కానీ నేను అలా కాదు. ప్రజలకి మోసం జరుగుతున్నప్పుడు పడే వ్యక్తిత్వం నాది కాదు. వ్యక్తిగతంగా నన్ను దెబ్బకొట్టాలని చూస్తే ఊరుకుంటాను. ప్రజల కోసం ముందుకు వచ్చినప్పుడు నన్ను దెబ్బకొట్టాలని చూస్తే అస్సలు సహించనని చెప్పారు.
అలాగే, జనసేనలోకి వస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతామనుకుంటే మీరందరూ రావద్దు. ప్రజా సేవకోసమయితేనే రండి. పార్టీలో నాకు కొందరు ఎక్కువ, తక్కువ అని ఉండదు. ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చని నాడు, నేను ప్రజల తరపున వచ్చి పోరాడతాను. నేను రెండు మాటలు మాట్లాడను మొదటి నుంచి చివరి వరకు ఒకే విధంగా మాట్లాడతాను అని చెప్పుకొచ్చారు.