ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీతో కలిసేవుందన్నారు. అయితే, రాబోయే రోజుల్లో ఎవరు ఎవరితో కలిసొస్తారో వారితోనే ముందుకు వెళతామన్నారు. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా ముందుకు వెళతామన్నారు. ఎవరు కలసి వచ్చినా కలిసి రాకపోయినా ముందుకే అడుగు వేస్తామన్నారు.
అయితే, ఎన్నికలకు చాలా సమయం ఉందని, పొత్తుల విషయం మాత్రం ఎన్నికలకు వారం రోజుల ముందు స్పష్టత వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితిని స్వాగతిస్తామన్నారు. అదేసమయంలో తాము బీజేపీతో పొత్తులో ఉన్నామన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు అనేది జాతీయ స్థాయిలో జరగాల్సివుందన్నారు. ఇకపోతే, ఏపీ ప్రభుత్వం విపక్షాలను అణిచివేయాలన్న ఏకైక లక్ష్యంతోనే చీకటి జీవో నంబర్ 1ని తెచ్చిందని పవన్ కళ్యాణ్ విమర్శించారు.