లాక్‌డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. దీంతో పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మందు బాబుల సంబరానికి హద్దే లేకుండా పోయింది. అనేక మద్యం షాపుల వద్ద డ్యాన్సులు వేస్తూ, బాణాసంచా కాల్చుతూ, కొబ్బరి కాయలు కొడుతూ ఇలా నానా హంగామా సృష్టించారు.
అయితే ఏపీలో పలుచోట్ల మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులకు విధులు కేటాయించారంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం దృష్ట్యా ఇలాంటి విధులు సరికాదని హితవు పలికారు. కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, అన్నార్తులకు ఆహారం, నిత్యావసరాలు సరఫరా చేయడం కోసం ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకోవడం సబబుగా ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు.
ప్రజలు కరోనా వ్యాప్తి కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారని, ఆలయాలకు ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్లకుండా, పండుగలకు కూడా దూరమయ్యారని, అదేసమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచి లాక్‌డౌన్ స్ఫూర్తికి తూట్లు పొడిచిందని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితులు చూసిన తర్వాతే తమిళనాడులోని వేలూరు జిల్లా అధికారులు చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో గోడ కట్టేశారని ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా జనసైనికులతో టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా, వైసీపీ ప్రభుత్వం కరోనా ఫ్రెండ్లీగా మారింది. సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైసీపీ... అధికారంలోకి వచ్చాక విడతల వారీగా బంద్ చేస్తామని మాట మార్చింది. మద్యాన్ని నిషేధించడానికి వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడొక మంచి అవకాశం. కానీ వారు వైన్ షాపులు తీసేందుకే మొగ్గుచూపారు అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.
సామాజిక దూరం పాటించడం కష్టమంటూ ఆలయాలు, చర్చిలు, మసీదులను బలవంతంగా మూసేశారని... లిక్కర్ షాపులకు మాత్రం ఇది వర్తించదా? అని ప్రశ్నించారు. మద్యం విక్రయాలకు సామాజిక దూరం లేకపోయినా ఫర్వాలేదా? అని అన్నారు. మద్యం దుకాణాలను ప్రారంభించిన రోజే ఆత్మహత్యలు చోటుచేసుకోవడం కలచివేసిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపంతో భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారనే వార్తను తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కళ్యాణ్ షేర్ చేశారు.