ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్ధశత్రువులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు చేతులు కలిపాయి. ఎన్నికల్లో విజయం కోసం పొత్తులు పెట్టుకున్నాయి. పోర్టు బ్లెయిర్ పురపాలక సంస్థకు జరిగే ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో టీడీపీ మూడు వార్డుల్లో పోటీ చేస్తుంటే మిగిలిన వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.
అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టు బ్లెయిర్ మున్సిపాలిటికీ ఈ నెల 6వ తేదీన పోలింగ్ జరుగనుంది. 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఏఎన్‌టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్‌ల మధ్య జరిగిన చర్చల్లో నిర్ణయించారు.
దీంతో టీడీపీ 2, 5, 16 వార్డుల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలోకిదిగుతారు. ఈ సందర్భంగా రంగలాల్ మాట్లాడుతూ, పోర్టుబ్లెయిల్ అభివృద్ధికి, ప్రజాస్వామ్యయుత పాలన అందించేందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పారు.