పల్నాడు జిల్లా పసుపుమయమైంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి బహిరంగ సభ జరుగుతుంది. జిల్లాలోని చిలకలూరిపేట బొప్పూడిలో జరిగే ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అయితే, ఈ ప్రజాగళం బహిరంగ సభకు రాష్ట్రంల నలుమూలల నుంచి ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో తరలి వస్తున్నారు. మూడు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్రవాహనాలపై ప్రజలు సందడిగా సభకు చేరుకున్నారు. మహిళలు సైతం భారీగా తరలివచ్చారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం ఇప్పటికే కార్యకర్తలతో నిండిపోయింది. సభకు వచ్చే ప్రజలకు మార్గ మధ్యలోనే భోజనం, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు.
విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి వేల సంఖ్యలో వాహనాలు సభకు చేరుకుంటున్నాయి. ఆర్టీసీ పూర్తి స్థాయిలో బస్సులు ఇవ్వకపోవడంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తున్నారు. పదేళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రానుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. బొప్పూడి ప్రజాగళం సభ చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు, బొప్పూడి ప్రజాగళం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. బొప్పూడికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా తెదేపా, జనసేన, భాజపా జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రజాగళం సభకు చేరుకునేందుకు వేలాది వాహనాలు ఒకేసారి మంగళగిరి టోల్ గేట్ వద్దకు చేరుకోవడంతో నిర్వాహకులు కాసేపు టోల్ గేట్లు ఎత్తేశారు. చిలకలూరిపేట నుంచి బొప్పూడి సభా వేదిక వరకు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
ఇదిలావుంటే, ఈ ప్రజాగళం సభ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సభకు హాజరయ్యేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బొప్పూడి చేరుకున్నారు. కాగా, ప్రజాగళం సభా వేదికపై కాకుండా, కార్యకర్తలు, నేతలతో కలిసి గ్యాలరీలో కూర్చోవాలని లోకేశ్ నిర్ణయించుకున్నారు. ప్రజాగళం సభా వేదికపైకి 14 మంది టీడీపీ నేతలను అనుమతిస్తున్నారు.
అలాగే, జనసేన పార్టీ నుంచి 9 మంది నేతలు ప్రజాగళం సభా వేదికపై ఆసీనులు కానున్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు, కొణతాల రామకృష్ణ, శివశంకర్, వెంకటేశ్వరరావు, బొమ్మిడి నాయకర్, కందుల దుర్గేశ్, లోకం మాధవి వేదికపై కూర్చుంటారు.
బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా బీజేపీ నుంచి ఆరుగురు నేతలు ప్రజాగళం సభ ప్రధాని వేదికపై కూర్చోనున్నారు. పురందేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, టీజీ వెంకటేశ్, సుధాకర్ బాబులకు అవకాశం కల్పించారు.