అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా వైద్య ఆరోగ్యశాఖలో రూ.16,270 కోట్ల అంచనాతో నాడు-నేడు ద్వారా పలు అభివృద్ధి పనులతో పాటు కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాలను చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. నాడు- నేడు ద్వారా వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ధి పనులు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
పాత వైద్య కళాశాలల్లో అభివృద్ధి పనులు, కొత్త మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలకు సంబంధించి ఏప్రిల్ కల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీ రిఫరల్, పల్లెకు డాక్టర్ల వ్యవస్థ, పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల, కొమరవోలు గ్రామాల్లో ఇటీవల ప్రజలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
నిర్మాణమే కాదు.. నిర్వహణా ముఖ్యమే
ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం భూ సమీకరణను వీలైనంత త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. భవనాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. భవనాలను కట్టడమే కాదు మెరుగ్గా నిర్వహించడం, పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమన్నారు. ఆస్పత్రులు కట్టిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ఆదేశించారు. పరిపాలనా అనుమతులతో పాటు సిబ్బంది నియామకాల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆరోగ్యశ్రీ రిఫరెల్ వ్యవస్థపై..
వైఎస్సార్ విలేజ్, అర్బన్ హెల్త్ క్లినిక్స్, పీహెచ్‌సీల సిబ్బందికి శిక్షణపై సమగ్ర వివరాలు అందించాలని సీఎం అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ రిఫరల్ వ్యవస్థపై సిబ్బందికి అవగాహన, పరిజ్ఞానం కల్పించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు, ఆశా వర్కర్లకు కూడా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. రిఫరల్ వ్యవస్థకు సంబంధించి ఏఎన్‌ఎం, ఆరోగ్య మిత్రలు ఏం చేయాలన్న దానిపై కార్యాచరణ ప్రక్రియను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎంప్యానల్డ్ ఆస్పత్రులపై పూర్తి అవగాహన ఉండాలని, రోగులకు మార్గనిర్దేశం చేసేలా సిబ్బందిని సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కడకు వెళ్లాలో తెలియక ఆరోగ్యం కోసం పేదలు డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తకూడదని స్పష్టం చేశారు.
వెయ్యి రూపాయలు దాటితే ఉచితంగా చికిత్స అందించాలనే ప్రభుత్వ విధానం సమర్థంగా అమలు కావాలంటే సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించడం చాలా అవసరమని సీఎం పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో లబ్ధిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని, ఆరోగ్య ఆసరా అందిందో లేదో తనిఖీ చేయాలని, ఎంప్యానల్ ఆస్పత్రిలో ఏదైనా సమస్యలు వస్తే రియల్ టైం డేటా ఉన్నతస్థాయికి అందాలని సీఎం పేర్కొన్నారు. దీనికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని అధికారులు తెలియచేయడంతో ప్రతి ఆరోగ్యమిత్ర వద్ద తప్పనిసరిగా ఫోన్ ఉంచాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీని సమర్థంగా అమలు చేయాలని పునరుద్ఘాటించిన సీఎం.. సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, క్రమం తప్పకుండా ఎంప్యానల్ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేశారు.
104, 108 వాహనాల నిర్వహణ బాగుండాలి..
104, 108 వాహనాలు ఎప్పటికీ కొత్తగానే కనిపించాలని, నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నిర్వహణలో రాజీ పడరాదని స్పష్టం చేశారు. వాహనాల కండిషన్, నిర్వహణ సమర్థంగా ఉండాలని సూచించారు.
పల్లెలకు డాక్టర్ల వ్యవస్థపై..
పల్లెలకు డాక్టర్ల వ్యవస్థపై గతంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతిపాదనలను అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోని వ్యవస్థలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు చేరువగా, నేరుగా పల్లెల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ విధానం ఉండాలన్నారు.
అస్వస్థత ఘటనలపై ఆరా..
పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల, కొమరవోలు గ్రామాల్లో ప్రజలు ఇటీవల అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన ఘటనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రఖ్యాత సంస్థల పరీక్షలు, వాటి ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు సురక్షితమంటూ పరీక్ష ఫలితాలు వచ్చాయని అధికారులు వెల్లడించారు. పూళ్లలో ఆహార పదార్థాలు సురక్షితమేనంటూ ఫలితాలు వచ్చాయని తెలిపారు. కొమరవోలులో ఆహార పదార్థాలపై ఫలితాలు ఇంకా రావాల్సి ఉందన్నారు. అస్వస్థతకు గురైన గ్రామాల్లో ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలని సీఎం సూచించారు.
కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై..
కోవిడ్-19 పరీక్షలు, వ్యాక్సినేషన్‌కు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. రికవరీ రేటు 99.04 శాతం. మరణాల రేటు 0.81 శాతం ఉందని, ఇప్పటివరకూ 1.30 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు.
10,011 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏప్రిల్ కల్లా పూర్తి
రాష్ట్రంలో 10,011 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను ఈ ఏడాది ఏప్రిల్ కల్లా పూర్తి చేసేలా చురుగ్గా పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. 1,133 పీహెచ్‌సీల్లో 151 చోట్ల కొత్తవి నిర్మిస్తుండగా 982 చోట్ల పునరుద్ధరణ పనులు అక్టోబరు కల్లా పూర్తి కానున్నట్లు తెలిపారు. ఏరియా ఆస్పత్రుల్లో నాడు –నేడు పనులను డిసెంబర్ కల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు సంబంధించి 3.1 కోట్ల చదరపు అడుగుల మేర నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. చైనాలోని బీజింగ్ ఎయిర్‌పోర్టుతో పోలిస్తే నాలుగు రెట్లకు పైగా, బుర్జ్ ఖలీఫా భవనం కన్నా ఆరు రెట్లకు పైగా నిర్మాణాలతో సమానమని అధికారులు పేర్కొన్నారు.
కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చిన్నారులతో సీఎం
కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ విజయవంతమైన చిన్నారులను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్యంపై తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈవో ఎ.మల్లిఖార్జున, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.