జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో, చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్ జైలు అధికారులకు ములాఖత్ దరఖాస్తు చేసుకోగా, వారికి జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వెంట హీరో బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌లు కూడా రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు.
దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. గురువారం రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబును పవన్ కల్యాణ్ కలుస్తుండడం సంతోషదాయకమన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇది కీలక మలుపు అని రఘురామ అభివర్ణించారు. ఆపదలో అండగా నిలిచేవాడే స్నేహితుడు అని ఉద్ఘాటించారు.