విజయవాడ: వారం రోజుల పాటు విజయవాడకు వచ్చే రైళ్లను నిలిపివేయబోతున్నారు. సిగ్నలింగ్ వ్యవస్థలో తీసుకురాబోతున్న ఆధునికీకరణ పనుల కోసం ఈ నెల 20 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. ఆ వారం రోజుల పాటు విజయవాడ కేంద్రంగా రాకపోకలు సాగించే 241 రైళ్లను పూర్తిగా, 361 రైళ్లు పాక్షికంగా రద్దవుతాయి. మరో 215 రైళ్లను దారి మళ్లిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి కాజీపేట్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే రైళ్లు సైతం ఆగిపోతాయి. అందువల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.
హైదరాబాద్-హౌరా మధ్య రాకపోకలు సాగించే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, న్యూఢిల్లీ-విశాఖ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్, సాయినగర్-కాకినాడ ఎక్స్‌ప్రెస్‌లు ఈ నెల 20 నుంచి 25 వరకు విజయవాడ స్టేషన్‌కు వెళ్లవు. ఈ ట్రైన్‌లను ఏలూరు, విజయవాడ బైపాస్ రాయనపాడు కొండపల్లి స్టేషన్‌ల మీదుగా నడుపుతారు. ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్ మీదుగా తిరుపతికి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ భువనగిరి, రాయగిరి, ఆలేరు, జనగామ, కాజీపేట్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ మార్గంలో కాకుండా పగిడిపల్లి, గుంటూరు, తెనాలి స్టేషన్‌ల మీదుగా తిరుపతికి రాకపోకలు సాగిస్తుంది.
ముంబై సీఎస్‌టీ-భువనేశ్వర్ మధ్య సికింద్రాబాద్ మీదుగా నడిచే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ సేవలు విజయవాడ, కాజీపేట్ మార్గంలో నిలిచిపోనున్నాయి. కొండపల్లి-విజయవాడ బైపాస్ మార్గంలో గుడివాడ, రాజమండ్రి మీదుగా మళ్లిస్తారు. ఇలా వివిధ రైళ్లను దారి మళ్ళిస్తారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు పేర్కొంటున్నారు.