నగరం అంతటా వర్షం కురిస్తే సుమారు 2 సెంటీ మీటర్ల నుంచి 5 సెంటీమీటర్ల వర్షపు నీటిని మాత్రమే పీల్చుకునే అవకాశం హైదరాబాదులోని డ్రైనేజీ సిస్టమ్‌కు ఉందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అయితే నగరంలోని అత్యధిక ప్రాంతాల్లో పది సెంటీమీటర్లకుపైగా వర్షం కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు ప్రవేశించింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు సూచనలు చేస్తూ, వాహనదారులు రోడ్లపైకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. మరో మూడు గంటల వరకు ఎవరూ రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేయవద్దని, ఈ మూడు గంటలు భారీ వర్షం హైదరాబాదును ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
అలాగే, నిజాంపేటలోని చెరువుకు గండిపడింది. హైదరాబాదు నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం 513.43 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో భారీ ఎత్తున నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కాస్త ఎడతెరిపి ఇవ్వడంతో హైదరాబాదులోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది.