ఈ కార్యక్రమం జరిగే రాజ్ భవన్ ఆవరణలో చేస్తున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి, అధికారులకు తగిన సూచనలు చేశారు. ఎట్ హోమ్ కార్యక్రమానికి విచ్చేసే అతిధులకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గనిర్ధేశనం చేశారు.
పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన మీనా, భద్రతాపరమైన ఏర్పాట్ల విషయంలో నిశిత పరిశీలన అవసరమని, కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ ప్రముఖులే అయినందున, వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని ఆదేశించారు.
దాదాపు 600 మంది అతిధులకు సరిపోయేలా ఎట్ హోమ్ ఏర్పాట్లు జరుగుతుండగా, ఆతిధ్యం విషయంలోనూ, సేవల పరంగానూ ఎటువంటి లోటు రాకూడదని ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న పర్యాటకశాఖ అధికారులకు స్పష్టం చేసారు.
భద్రతాపరమైన కారణాల నేపధ్యంలో అన్ని వాహనాలనూ రాజ్ భవన్ మెయిన్ గేటు వద్దనే నిలిపివేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ ల వాహనాలను మాత్రమే లోపలకు అనుమతిస్తామన్నారు.
ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వాతంత్ర సమరయోధులు, రాష్ట్ర మంత్రులు, క్రీడాకారులు, నగర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. మరోవైపు గణతంత్ర దినోత్సవ వేడుకల నేపధ్యంలో రాజ్ భవన్ ను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.