ప్రముఖ రౌడీ షీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్‌కు రాజమండ్రి కేంద్ర కారాగారంలో పని చేసే సిబ్బంది దాసోహమైనట్టు ప్రచారం సాగుతుంది. ఈ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ కదలికలు, ఫోన్ సంభాషణలపై ఎలాంటి నిఘా లేదు. దీనికి కారణం జైలు సిబ్బంది బోరుగడ్డకు దాసోహం కావడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ నేత నారా లోకేశ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో పెట్రేగిపోయాడు. ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయగా, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే ఆయన సెంట్రల్ జైలు నుంచి పలువురు వైకాపా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ చేసినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందేందుకు, తన తల్లికి అనారోగ్యం పేరిట నకిలీ మెడికల్ సర్టిఫికేట్ సృష్టించి, న్యాయస్థానానికి సమర్పించాడు. ఈ కాన్ఫరెన్స్ కాల్స్ సంభాషణల్లోనే బీజం పడినట్టు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. జైలులో ఉండే బోరుగడ్డ అనిల్ కుమార్ కదలికలు, ఫోన్ సంభాషణలపై ఎలాంటి నిఘా లేకపోవడం, జైలు సిబ్బంది అతినికి దాసోహమవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు.