ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం న్యాయం కోరిన హిందువులను నిర్బంధించి,అన్యమత అధికారులకు పెత్తనం కట్టబెడుతన్నదని రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామతీర్థంలో శ్రీరాముని తల నరికి వేసిన సంఘటనలో ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తోందన చెప్పారు.
చంద్రబాబుకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారని, తీరా కొండపైకి వెళ్లిన తరువాత గుడి తలుపులు మూసేశారని చెప్పారు. అలాగే దీనిపై సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు కోరితే సిఐడి విచారణకుఆదేశించి అన్య మతస్తుడైన ఎడిజి సునీల్ కుమార్ ను దర్యాప్తు అధికారిగా నియమించారని చెప్పారు. మంగళవారం సంఘటన స్ధలంలో పర్యటించిన సునీల్ కుమార్ విగ్రహ విధ్వంసం పక్కా ప్రణాళికతో జరిగిందని చెప్పడం గమనార్హం అన్నారు.
దీనిని బట్టి ఈ కేసును తప్పదారి పట్టించి రాజకీయ రంగు పూసే ప్రయత్నం జరుగుతున్నదని భావించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి రిపోర్టునే సునీల్ కుమార్ దర్యాప్తు రిపోర్టుగా కోర్టుకు సమర్పిస్తారని చెప్పారు కాగా మంగళవారం బిజెపి నేతలు , స్వాములను కొండపైకి వెళ్ళకుండా నిర్బంధించడంలోను కుట్ర దాగివుందన్నారు.
ఎంపి విజయసాయి రెడ్డిని కొండపైన, గుడిలో యధేచ్ఛగా తిరగనిచ్చిన ప్రభుత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబును గుడిలోకి, మిగిలిన వారిని కొండపైకి అనుమతించక పోవడమం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, డిజిపి, దర్యాప్తు అధికారి అందరూ అందరూ ఒకే మతస్తులు కావడంతో హిందువులకు న్యాయం జరుగుతుందనడం సందేహాస్పదం అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని లేదా సిఐడి దర్యాప్తు అధికారిని అయినా మార్చాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశాడు.