పరకాలపై టిడిపి శ్రేణులు ఆగ్రహం

బుధవారం, 16 డిశెంబరు 2020 (05:59 IST)
టిడిపి ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన 'పరకాల ప్రభాకర్‌' 'రాజధాని విషాదం' పేరుతో  విడుదల చేసిన డాక్యుమెంటరీపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 'పరకాల' విడుదల చేసిన డాక్యుమెంటరీలో గత ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయడమే దీనికి కారణం.

గత ప్రభుత్వం వల్లే రాజధానిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయనే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై టిడిపి కార్యకర్తలు, నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత 'పరకాల' రాజధానిపై డాక్యుమెంటరీ చేశారని, దాని ప్రొమోను టిడిపి శ్రేణులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా కార్యకర్తలు బాగా ప్రచారం చేశారు.

రాజధానిలో పనులు ఆగిపోవడానికి, ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై 'పరకాల' ధ్వజమెత్తి ఉంటారని వారు భావించి దాన్ని ట్రోల్‌ చేశారు. అయితే పూర్తి డాక్యుమెంటరీ వచ్చిన తరువాత దాన్ని చూస్తే..గత ప్రభుత్వాన్నే 'పరకాల' టార్గెట్‌ చేసుకోవడంతో వారు హతాశయులయ్యారు.

ఇదేమిటి..ఈయన కూడా మమ్మల్లేనే నిందిస్తున్నారు...రాజధాని గతికి కారణమైన ప్రస్తుత ప్రభుత్వాన్ని కాని, కేంద్ర ప్రభుత్వాన్ని కాని పల్లెత్తి మాట అనకుండా అన్ని అనర్ధాలకు టిడిపి ప్రభుత్వమే కారణమన్నట్లు వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మూడు పంటలు పండే మాగాణి భూమిని లాగేసుకున్నారని, ఆశలు చూపించి నిర్మాణాలు సాగించలేదని డాక్యుమెంటరీలో చెప్పడంపై టిడిపి శ్రేణులు నివ్వెరపోతున్నాయి. నాడు 'చంద్రబాబు'కు నీడలా రాజధానిపై తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ భాగస్వామిగా ఉన్న 'పరకాల ప్రభాకర్‌' రెండేళ్ల తరువాత తీరిగ్గా వాగ్భాణాలు ఎక్కుపెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతిపై కులముద్ర వేసి, అమరావతిని భ్రమరావతిని అని వ్యాఖ్యానించిన ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు వ్యాఖ్యలను డాక్యుమెంటరీలో పొందుపరచడం, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రసంగాలతో నింపేసి గత ప్రభుత్వాన్ని నిందించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

'పరకాల ప్రభాకర్‌' రాజధానిపై డాక్యుమెంటరీ తీస్తున్నారంటే టిడిపి నేతలు, కార్యకర్తలు, రాజధాని అమరావతి రైతులు ప్రస్తుత ప్రభుత్వాన్ని నిలదీస్తారని, ప్రశ్నిస్తారని భావించారు కానీ..ఆయన దానికి విరుద్ధమైన రీతిలో టిడిపి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడంతో..ఈయనా 'చంద్రబాబు' రాళ్లు వేయడానికే రాజధాని విషాదం పేరిట డాక్యుమెంటరీ తీశారని వారు ఆరోపిస్తున్నారు.

మొత్తం మీద..'చంద్రబాబు' ఎవరినీ నమ్మరని..అయితే ఆయన ఎవరినైతే నమ్ముతారో..వాళ్లే ఆయనను నట్టేట ముంచేస్తారని 'పరకాల ప్రభాకర్‌' మరోసారి నిరూపించారని సగటు టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు