తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల్ని తిరిగి అదే పదవిలో కొనసాగిస్తామని, అది తాము అధికారంలోకి రాగానే జరుగుతుందని వైసీపీ తెలిపింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తితిదే నిర్వహించే తొలి పాలకమండలి సమావేశంలో వయస్సు కారణంగా తొలగించిన ముగ్గురు అర్చకులను విధుల్లోకి తీసుకోవడమే తమ అజెండా అంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
కాగా రమణ దీక్షితులు మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర్ రెడ్డితో సుమారు గంటపాటు సమావేశమై పలు విషయాలు మాట్లాడారు. పదవీ విరమణ అనేది కొన్ని వృత్తుల వారికే పరిమితమవుతుందనీ, కానీ ఆలయంలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ ఏమిటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఈ నిబంధనను ఎత్తివేసి అర్చకులకు పదవీ విరమణ వయసు అన్నది లేకుండా చేస్తామన్నారు.