ప్రభుత్వ అనుమతితోనే స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్ : రమేష్ ఆస్పత్రి

సోమవారం, 10 ఆగస్టు 2020 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఉన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో రమేష్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటరులో ఆదివారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృత్యువాతపడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఈ అగ్ని ప్రమాదానికి రమేష్ ఆస్పత్రి యాజమాన్యమే కారణమంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, ఆ ఆసుపత్రే స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను లీజుకు తీసుకుని కొవిడ్‌-19 కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 
 
దీనిపై రమేష్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. హోటల్‌ నిర్వహణతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పింది. ఎక్కువ మంది కొవిడ్‌-19 బాధితులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో స్వర్ణ ప్యాలెస్ హోటల్‌ను కరోనా చికిత్సా కేంద్రంగా మార్చామని పేర్కొంది. 
 
హోటల్ నిర్వహణతో సంబంధం లేకుండా తాము రోగులకు వైద్య సేవలు అందించామని వివరించింది. రోగులను చేర్చుకోవాలని భారీగా వినతులు వస్తుండటంతో అన్ని సౌకర్యాలున్న హోటల్లో సర్కారు అనుమతితో రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ఇక్కడ చికిత్స తీసుకున్న కరోనా బాధితులు చక్కగా కోలుకుంటున్నారని వివరించింది. అయితే, దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం సంభవించిందని, దీనిపట్ల తాము కూడా చింతిస్తున్నట్టు పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు