తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో గత రెండు రోజులుగా నిర్వహించిన మహానాడు షరామామూలుగానే వైభవంగా ముగిసింది. అన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మళ్లీ ఆధికారంకోసం కృషి చేస్తామని ప్రతిన కూడా చేశారు. 45 రకాల వంటకాలతో రెండు రోజులపాటు అతిథులకు షడ్రసోపేత భోజనాలు వడ్డించి సంతృప్తి చేశారు. కాని ఒక్కవిషయంలో మాత్రం ఈ దఫా మహానాడు చరిత్ర సృష్టించింది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వంశీయులు ఎవరూ హాజరు కాకుండానే మహానాడు జరగటం పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకవైపు భారతరత్న అవార్డును దివంగత మహానేత ఎన్టీఆర్‌కి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన వేదికమీద ఆ ఎన్టీఆర్ వారసులు ఏ ఒక్కరూ లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులను కలిచి చేసింది.
మహానాడు వేదికగా టీడీపీలోని పలు లుకలుకలు బయటపడ్డాయి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు కుటుంబం ఈ మహానాడుకు దూరంగా ఉంది. నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ, బాలకృష్ణ, యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు రాయపాటి, ఎస్వీ రామసుబ్బారెడ్డి కూడా మహానాడుకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
తెలుగుదేశం పార్టీ తాజాగా నిర్వహించిన మహానాడుకు ఇద్దరు సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం గమనార్హం. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, సీనియర్ నేత ఎస్వీ రామసుబ్బారెడ్డి మహానాడుకు దూరంగా ఉన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఎస్వీ సుబ్బారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇక తనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి తనకు ఇస్తానని హామీ ఇవ్వకపోవడంతో ఎంపీ రాయపాటి అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.
ఇలా కుటుంబపరంగా నందమూరు వారసులు ఎవరూ మహానాడుకు హాజరు కాకపోవడం, పార్టీలోనే అత్యంత సీనియర్ నేతలుగా ఉన్న రాయపాటి, ఎస్వీ రామసుబ్బారెడ్డి కూడా డుమ్మా కొట్టడం పార్టీకి శుభసూచకం కాదని తొలినుంచి పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలు చర్చించుకుంటున్నారని సమాచారం. పైగా ఈసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయల్లోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే తెలుగుదేశం రాజకీయాల్లోకి కాదన్నది అందరికీ తెలిసిన విషయమే.
కాగా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఇద్దరూ నందమూరి వంశీయుల గైర్ హాజర్ గురించి మాట మాత్రం ప్రస్తావించకుండా వాళ్లందుకు రాలేదో సర్ది చెప్పే పనికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించడం విశేషం. అయినప్పటికీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ఇక లేదనే విమర్శలను ఈ సమర్ధన తప్పించలేకపోయింది.